Begin typing your search above and press return to search.

రూ.20లక్షల కోట్లలో ఆ రూ.6లక్షల కోట్లను కలిపి చూపించారా?

By:  Tupaki Desk   |   13 May 2020 9:30 AM GMT
రూ.20లక్షల కోట్లలో ఆ రూ.6లక్షల కోట్లను కలిపి చూపించారా?
X
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వేళ.. దేశ ప్రధాని నుంచి ఏదైనా భారీ ప్రకటన వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూసే వారిని ఏ మాత్రం నిరాశ పర్చకుండా తాను చేయాల్సిందంతా చేశారు మోడీ. ఎవరి అంచనాలకు అందని రీతిలో రూ.20లక్షల కోట్ల భారీ ప్యాకేజీని కేంద్రం సిద్ధం చేసిందంటూ ఉత్కంఠను పెంచేసిన ప్రధాని.. ఆ వివరాల్ని మాత్రం సోమవారం నుంచి దశల వారీగా ప్రకటిస్తామని చెప్పటం ద్వారా సస్పెన్సును పెంచేయటమే కాదు.. ఆనంద్ మహీంద్రా లాంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలకు మంగళవారం రాత్రి నిద్ర లేకుండా చేశారు.

ప్రధాని మోడీ అన్నంతనే చాలామందికి అద్భుతమైన నాయకుడిగా కనిపిస్తే.. కొందరికి మాత్రం ఎప్పటికి అర్థం కాని ఫజిల్ గా కనిపిస్తారు. ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ.. చేసే పనిలోనూ ఏదో ఒక శ్లేష తప్పనిసరిగా ఉంటుంది. ఆ వాదనకు బలం చేకూరేలా తాజా ప్యాకేజీ ఉందని చెప్పాలి. తాను చెప్పిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ వివరాల్ని ప్రకటించకుండా ప్రధాని భారీ ఎత్తు వేశారన్న మాట వినిపిస్తోంది.

తాజగా ప్రకటించిన రూ.20లక్షల కోట్లలోనే.. ఇప్పటికే రిజర్వు బ్యాంకు.. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని కూడా కలిపేశారన్న మాట వినిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల అంచనాల ప్రకారం లాక్ డౌన్ సందర్భంగా భారత రిజర్వు బ్యాంకు రూ.4.25లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని ద్వారా సామాన్యులకు ఏ మేరకు లబ్థి చేకూరిందన్న విషయంపై ఇప్పటికి క్లారిటీ లేదు. సామాన్యుల సంగతే కాదు.. మధ్య తరగతి వారికి కలిగిన ప్రయోజనం ఏమిటో బోధ పడింది లేదు.

ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ వేళ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రూ.1.70లక్షల కోట్ల ప్యాకేజీ సంగతి తెలిసిందే. ఈ రెండు ప్యాకేజీలు.. ప్రధాని తాజాగా ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీలో కలిసి ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. అంటే.. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో.. ఇప్పటికే అమలైనట్లుగా చెప్పే రూ.6లక్షల కోట్ల ప్యాకేజీ కూడా కలిసిపోయిందన్న మాట. అంటే.. మోడీ మాష్టారి రూ.20లక్షల కోట్లలో రూ.6లక్షల కోట్లు ఇప్పటికే అమలు చేసినవి కలిసి ఉంటే.. ఇప్పుడు అమలు చేసేది రూ.14లక్షల కోట్లు మాత్రమేనా? అన్నది ప్రశ్న. నేతిబీరలో నేతి లెక్కనే.. మోడీ మాష్టారి ప్యాకేజీ లో విషయాలు ఉంటాయన్న విమర్శలు మొదలయ్యాయి.