Begin typing your search above and press return to search.

నిపుణుల హెచ్చ‌రిక‌లు: క‌రోనా క‌న్నా లాక్‌ డౌనే ప్ర‌మాద‌క‌రం

By:  Tupaki Desk   |   1 May 2020 12:23 PM GMT
నిపుణుల హెచ్చ‌రిక‌లు: క‌రోనా క‌న్నా లాక్‌ డౌనే ప్ర‌మాద‌క‌రం
X
క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న స‌మ‌యంలోనే భార‌త‌దేశం అప్ర‌మ‌త్త‌మై ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా లాక్‌ డౌన్ విధించింది. తొలి ద‌శ లాక్‌డౌన్ విజ‌య‌వంతంగా సాగుతున్న క్ర‌మంలోనే అక‌స్మాత్తుగా భార‌త‌దేశాన్ని ఓ ఘ‌‌టన‌ కుదిపేసింది. ఆ ఘ‌ట‌న వ‌ల‌న 500లోపు ఉన్న క‌రోనా కేసులు ఒక్క‌సారిగా వేల‌కు చేరాయి. దేశ‌మంత‌టా క‌రోనా వైర‌స్ విస్త‌రించి ప‌రిస్థితులు దారుణంగా మార్చేసింది. ఇప్పుడు ఏకంగా 35 వేల‌కు చేరువ‌గా క‌రోనా కేసులు ఉన్నాయి. ఇంకా ఆ వైర‌స్ తీవ్రంగా వ్యాపిస్తోంది. అయితే ఈ నేప‌థ్యంలో తొలి ద‌శ లాక్‌డౌన్ ముగిసి రెండో విడ‌త కూడా విధించారు. ఇప్పుడు రెండో విడ‌త లాక్‌డౌన్ ముగుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌నే ఉత్కంఠ అంద‌రిలోనూ ఉంది. అయితే లాక్‌డౌన్ కొన‌సాగిస్తే మాత్రం ప‌రిస్థితులు దారుణంగా మారేలా ఉన్నాయి.

మ‌రోసారి లాక్‌ డౌన్ విధిస్తే మాత్రం క‌రోనా క‌న్నా అధికంగా ప్ర‌జ‌లు మృత్యుబారిన ప‌డ‌తార‌ని విశ్లేష‌కులు - నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ముఖ్యంగా ఆక‌లి చావులు భారీగా సంభ‌విస్తున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బారిన దేశం ఎంత న‌ష్ట‌పోయిందో అంత‌కు రెట్టింపు స్థాయిలో న‌ష్టం మ‌రోసారి లాక్‌డౌన్ విధిస్తే సంభ‌విస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇప్పుడు విధించిన లాక్‌ డౌన్ వ‌ల‌న పేద‌ల‌తో పాటు ఉద్యోగులు ప్ర‌భావిత‌మ‌య్యారు. ఇప్పుడు మూడోసారి విధిస్తే మాత్రం ముఖ్యంగా పేద‌ - మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు దుర్భర ప‌రిస్థితులు ఎదుర్కొంటార‌ని నిపుణులు చెబుతున్నారు.

అంద‌రి ఆరోగ్య రీత్యా ఇన్నాళ్లు విధించిన లాక్‌ డౌన్‌ కు అంద‌రూ స‌హ‌క‌రించారు. బ‌లిశాకు.. ఎల్లిపాయ కారం వేసుకోనైనా తిని ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇక మూడోసారి లాక్‌ డౌన్ విధిస్తే మాత్రం త‌మ‌వ‌ల్ల కాద‌ని చెప్పేస్తున్నారు.

అయితే ఇన్నాళ్లు విధించిన లాక్‌ డౌన్‌ తో పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఏమి లేద‌ని తేలింది. ఎందుకంటే ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌లేదు. రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయే మిన‌హా త‌గ్గ‌డం లేదు. రెండో లాక్‌ డౌన్ మే 3వ తేదీతో ముగుస్తోంది. మూడో ద‌శ లాక్‌డౌన్‌పై తీవ్ర చర్చ సాగుతోంది. కొన్ని రాష్ట్రాలు లాక్‌ డౌన్‌ కు మ‌ద్ద‌తుగా ఉండ‌గా చాలా రాష్ట్రాలు మాత్రం వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాయి. ఇప్ప‌టికే కోలుకోని లేని విధంగా న‌ష్టం సంభ‌వించింద‌ని ఇక త‌మ‌వ‌ల్ల కాద‌ని - స‌డ‌లింపుల‌తో లాక్‌ డౌన్ కొన‌సాగించాల‌ని విన్న‌విస్తున్నాయి.

అయితే లాక్‌ డౌన్ కొన‌సాగిస్తే మాత్రం ఆక‌లి చావులు సంభ‌విస్తాయ‌ని ఆర్థిక‌వేత్త‌ల‌తో పాటు ప‌లువురు మేధావులు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఇన్ఫో నారాయణమూర్తి - రఘురాం రాజన్ - కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ త‌దిత‌రులు ఇదే విష‌యాన్ని చెబుతున్నారు. లాక్‌డౌన్ మంచిదే అయినా సుదీర్ఘ కాలం ఉంటే మాత్రం త‌ట్టుకోలేమ‌ని తెలిపారు. పేదల సంఖ్య అధికంగా ఉంద‌ని, లాక్‌ డౌన్ కొన‌సాగిస్తే పెద్ద సంఖ్య‌లో ఉన్న పేద‌ల‌కు స‌హాయం అందించ‌డం ప్ర‌భుత్వానికి కుద‌ర‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

లాక్‌ డౌన్ పొడిగిస్తే దేశవ్యాప్తంగా సుమారు 19 కోట్ల మంది ఆక‌లి చావులు ఎదుర్కొంటార‌ని - అసంఘటిత.. స్వయం ఉపాధి పొందుతున్నవారి జీవనాధారం ప్రమాదంలో పడుతుందని ఇన్ఫోసిస్ నారాయ‌ణ మూర్తి హెచ్చరించారు. వ్యాపారులు సైతం 15 నుంచి 20 శాతం ఆదాయాన్ని కోల్పోతారని తెలిపారు. ఇది ఎన్నో కుటుంబాలను చిదిమేస్తుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ్యాపార‌వేత్త సంప‌ద ఆగిందంటే కార‌ణం కంపెనీలు మూతపడినపుడు…కంపెనీలు మూత‌ప‌డ‌డం అంటే ఉద్యోగులను తొల‌గించ‌డ‌మేన‌ని.. అలా తొల‌గిస్తే వారంతా రోడ్డున పడతార‌ని వివ‌రించారు. లాక్‌ డౌన్‌ తో ఎటుచూసినా సామాన్యుడే నష్టపోతాడని తెలిపారు. ఈ విధంగా చాలామంది లాక్‌ డౌన్ కొన‌సాగిస్తే ఉండే విప‌త్క‌ర ప‌రిణామాల‌ను వివ‌రిస్తున్నారు. అన్ని ఆలోచించి కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.