Begin typing your search above and press return to search.

ఆయన దందాల్లో అందరూ ఆటబొమ్మలే!

By:  Tupaki Desk   |   25 Nov 2018 3:49 AM GMT
ఆయన దందాల్లో అందరూ ఆటబొమ్మలే!
X
సుజనా చౌదరి వ్యాపారాలను, ఆయన దందాలను గమనిస్తోంటే.. అంతా తోలుబొమ్మలాట వ్యవహారం లాగా కనిపిస్తోంది. ఆడించే వాడు ఒకే ఒక్కడుంటాడు. తెరమీద కనిపించేలా ఆడే తోలుబొమ్మలు మాత్రం అనేకం ఉంటాయి. వాటి అన్నింటి కదలికలను నియంత్రించేలా దారాలను తన మునివేళ్లకు కట్టుకుని.. ఆటగాడు ఒక్కడే వాటన్నింటితోనూ ‘షో’ నడిపిస్తుంటాడు. ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించి, పలు డాక్యుమెంట్లను, కొన్ని కార్లను, ఇతర లావాదేవీల వ్యవహారాలను స్వాధీనం చేసుకున్న తర్వాత.. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాపార సామ్రాజ్యం మరియు అక్కడి బాగోతాల గురించి ప్రెస్ నోట్ రూపేణా వెల్లడైన వాస్తవాలను గమనిస్తోంటే.. దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెల్లడవుతున్నాయి.

5700 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగవేయడం, ఇతర ఆర్థిక అక్రమ లావాదేవీలకు సంబంధించిన కేసుల్లో ఈడీ అధికారులు తెలుగుదేశం నాయకుడు సుజనా చౌదరి ఆస్తుల మీద దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో మొత్తం 120 డొల్ల కంపెనీలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇవన్నీ కేవలం ఆర్థిక లావాదేవీలు, అక్రమాలు నడపడానికి ఎగవేయడానికి వీలుగా బ్యాంకు రుణాలు పుట్టించుకోవడానికి ఏర్పడిన పేపర్ కంపెనీలే తప్ప... వాస్తవంలో ఎలాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్న కంపెనీలు కాదని కూడా అధికారులు గుర్తించారు.

తమాషా ఏంటంటే.. సుజనా వ్యాపార సామ్రాజ్యం నుంచి అధికారులు డొల్ల కంపెనీలకు చెందిన 126 రబ్బరు స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఆయా సమస్త కంపెనీలకు చెందిన డైరక్టర్లు అందరూ కూడా బొమ్మల్లాంటి వాళ్లేనని, వాళ్లందరూ కూడా సుజనాచౌదరి నిర్దేశంలోనే పనిచేస్తున్నారని కూడా గుర్తించినట్లు ఈడీ ప్రకటించింది. సుజనా వ్యక్తిగత పూచీకత్తు మీద ఆయా కంపెనీల పేరిట బ్యాంకులనుంచి రుణాలను పుట్టించడం మినహా.. ఆ కంపెనీలు చేసిన వ్యాపార లావాదేవీలు ఏమీ లేవని కూడా గమనించారు. పైగా ఈడీ చాలా ముందుజాగ్రత్తతో- ఈ కంపెనీల లావాదేవీలన్నిటికీ సుజనా చౌదరి ఒక్కడే బాధ్యుడని, ఆయన సూచనల మేరకు తాము సంతకాలు మాత్రమే చేసేవారమని, డైరక్టర్లనుంచి వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నది. ఇన్నాళ్లూ కంపెనీల పేరిట ఇలాంటి తోలుబొమ్మలాటను నడిపిస్తూ వచ్చిన సుజనా చౌదరి దందాలకు తెరపడినట్టే. ఆయన మీద ఈ ఆర్థిక అరాచకాల కేసులు కూడా తీవ్రంగానే నమోదు కానున్నట్లు తెలుస్తోంది.