Begin typing your search above and press return to search.

ఢిల్లీలో అరెస్ట్‌..తెలుగు రాష్ట్రాల్లోని నేత‌ల గుండెల్లో రైళ్లు!

By:  Tupaki Desk   |   27 July 2019 8:00 AM GMT
ఢిల్లీలో అరెస్ట్‌..తెలుగు రాష్ట్రాల్లోని నేత‌ల గుండెల్లో రైళ్లు!
X
ఢిల్లీలో జ‌రిగిన ఒక అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ముఖుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తేలా చేస్తున్నాయి. హైద‌రాబాద్ కేంద్రంగా వ్యాపారం చేసే ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త స‌తీష్ సానాను ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు దేశ రాజ‌ధానిలో అరెస్ట్ చేశారు. సామాన్యుల‌కు ఏ మాత్రం ప‌రిచ‌యం లేని స‌తీశ్ సానా.. అత్యున్న‌త వ‌ర్గాల్లోనూ.. పైస్థాయి నేత‌ల్లోనూ.. టాప్ బిజినెస్ వ‌ర్గాల్లోనూ ఇత‌గాడి పేరు సుప‌రిచితం.

గ‌డిచిన కొద్దికాలంలో చాలా కీల‌క‌మైన ఇష్యూల సంద‌ర్భంగా ఇత‌గాడి పేరు బ‌య‌ట‌కు రావ‌టం గ‌మ‌నార్హం. మనోడి రేంజ్ ఎంతంటే.. సీబీఐ డైరెక్ట‌ర్ అలోక్ వ‌ర్మ‌.. స్పెష‌ల్ డైరెక్ట‌ర్ రాకేశ్ ఆస్తానాల మ‌ధ్య విభేదాలు పొడ‌చూపిన‌ప్పుడు స‌తీశ్ పేరు బాగా హైలెట్ అయ్యింది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. సీబీఐ స్పెష‌ల్ డైరెక్ట‌ర్ అస్తానాపై లిఖిత పూర్వ‌క కంప్లైంట్ ఇవ్వ‌టం ఒక ఎత్తు అయితే.. ఇత‌గాడిచ్చిన ఫిర్యాదు ఆధారంగా అవినీతి కేసు న‌మోదైంది.

అలాంటి స‌తీశ్ ను తాజాగా మ‌నీలాండ‌రింగ్ కు పాల్ప‌డిన ఆరోప‌ణ‌ల మీద ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్ర‌ముఖ మాంసం ఎగుమ‌తిదారు అయిన మోయిన్ ఖురేషీ కి చెందిన సంస్థ‌లో రూ.50 ల‌క్ష‌ల విలువైన షేర్ల‌ను కొనుగోలు చేశార‌ని.. దీనికి సంబంధించి ఈడీ అధికారులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు పొంత‌న లేని స‌మాధానాలు చెప్ప‌టంతో అదుపులోకి తీసుకొని ప్ర‌శ్నిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఇత‌డి విచార‌ణ పూర్తి అయ్యాక స్థానిక కోర్టులో ప్ర‌వేశ పెడ‌తారంటున్నారు. షేర్లు కొనుగోలు చేసిన‌ట్లు చెబుతున్న స‌తీశ్‌.. వాటిని త‌న మీద బ‌ద‌లాయించ‌క‌పోవ‌టాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు? షేర్లు చేతికి ఎందుకు రాలేద‌న్న దానిపై స‌మాధానం చెప్ప‌లేద‌ని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్ర‌భుత్వంలోని అత్యున్న‌త స్థానాల్లో ఉన్న అధికారుల మ‌ధ్య డీల్స్ ను సెట్ చేసే టాలెంట్ స‌తీశ్ కు ఎక్కువ‌న్న ఆరోప‌ణ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. స‌తీశ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కీల‌క నేత‌ల‌తో ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని.. వారికి సంబంధించిన విషయాల్ని డీల్ చేసిన టాలెంట్ ఉంద‌న్న మాట వినిపిస్తోంది. స‌తీశ్ తీగ లాగే కొద్ది కొత్త కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయ‌ని చెబుతున్నారు.

ఖురేషీ కేసు వ్య‌వ‌హారంలో స‌తీశ్ పాత్ర‌ను తేల్చేందుకు ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక విచార‌ణ బృందంలో అప్ప‌టి స్పెష‌ల్ డైరెక్ట‌ర్ రాకేష్ ఆస్తానా నేతృత్వం వ‌హించారు. అప్ప‌ట్లో స‌తీశ్ ను అరెస్ట్ చేయాల‌ని రాకేశ్ అనుకున్నార‌ని.. ఆ అరెస్ట్ నుంచి త‌ప్పించుకోవ‌టానికి ఆయ‌న‌కు ముడుపులు ఇచ్చిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఈ వ్య‌వ‌హారానికి సంబంధించిన డ‌బ్బుల్ని దుబాయ్ లోని మ‌నోజ్.. సోమేష్ ప్ర‌సాద్ ల ద్వారా అస్తానాకు రూ.5 కోట్లు చేర్చాల‌ని భావించిన‌ట్లు చెబుతారు. అంతేకాదు.. ఒక కేసులో ఊర‌ట ల‌భించేందుకు వీలుగా అప్ప‌ట్లో చంద్ర‌బాబుకు అత్యంత సన్నిహితుడు.. ప్ర‌స్తుతం బీజేపీలో చేరిన సీఎం ర‌మేశ్ కూడా సాయం చేసిన‌ట్లు చెబుతారు. అయితే.. ఈ వాద‌న‌ల్ని సీఎం ర‌మేశ్ ఖండించారు. తాజాగా స‌తీశ్ ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవ‌టం తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారిందని చెప్ప‌క త‌ప్ప‌దు.