Begin typing your search above and press return to search.

యెస్ బ్యాంక్ ఫౌండ‌ర్ అరెస్టు..ఏడాదిగా అలా జ‌రుగుతుండ‌టంతో

By:  Tupaki Desk   |   8 March 2020 6:34 AM GMT
యెస్ బ్యాంక్ ఫౌండ‌ర్ అరెస్టు..ఏడాదిగా అలా జ‌రుగుతుండ‌టంతో
X
దేశంలోని ప్ర‌ముఖ కార్పొరేట్ దిగ్గ‌జం యెస్ బ్యాంక్ సంక్షోభంలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రానాకపూర్‌ ను ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరక్టేరేట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల విచారణ అనంతరం బ్యాంక్‌ స్కాం, మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ అతడిని అరెస్ట్‌ చేసింది. మనీ ల్యాండరింగ్‌ కేసుకు సంబంధించి శుక్రవారం పశ్చిమ ముంబైలో కపూర్‌ కు ఉన్న సముద్ర మహల్‌ ఇంటిపై దాడులు నిర్వహించినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. అనంత‌రం ఈ అరెస్టును చేప‌ట్టాయి.

డీహెచ్ ఎఫ్ ఎల్‌ కు బ్యాంకు ఇచ్చిన రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారడం అదేవిధంగా మరో కార్పొరేటు సంస్థకు ఇచ్చినా రుణాల్లో కపూర్‌ అక్రమాలకు పాల్పడ్డారని ఆధారాలు లభించడంతో శుక్రవారం రాత్రి ఈడీ అధికారులు రానాకపూర్‌ నివాసానికి చేరుకుని తనిఖీలు చేపట్టి విచారణ చేశారు. అనంత‌రం ఈడీ కపూర్‌ను అరెస్ట్‌ చేసింది. పీఎంఎల్ ఏ కింద నమోదైన కేసుకు సంబంధించి మరింత సమాచారం సేకరించాలనే ఉద్దేశంతో ఆయనను ప్రశించినట్లు తెలిపాయి. కపూర్‌ భార్యకు కార్పొరేట్‌ రుణాల అందజేతకు సంబంధించిన వ్యవహారంలో ఆయనకు సంబంధం ఉన్నట్లు గుర్తించిన ఈడీ..ఈ కేసులో మరింత సమాచారం సేకరించడానికి ఈ దాడులు, అరెస్టులు చేసింది.

మ‌రోవైపు ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్టుకు ముందు యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ క‌ల‌క వ్యాఖ్య‌లు చేశారు. ``బ్యాంక్‌ లో జరుగుతున్న పరిణామాల గురించి నాకేమీ తెలియదు. గత ఏడాదికి పైగా బ్యాంక్‌ కార్యాకలాపాలకు దూరంగా ఉంటుండటంతో బ్యాంకులో జరుగుతున్న విషయాలు తెలిసే అవకాశాలు లేవు`` అంటూ రాణా కపూర్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.