Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల ముంగిట‌!... టీడీపీకి బిగ్ షాక్‌!

By:  Tupaki Desk   |   2 April 2019 5:49 PM GMT
ఎన్నిక‌ల ముంగిట‌!... టీడీపీకి బిగ్ షాక్‌!
X
కీల‌క ఎన్నిక‌ల ముంగిట ఏపీలో అధికార పార్టీ టీడీపీకి బిగ్ షాక్ త‌గిలింద‌నే చెప్పాలి. పార్టీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి కంపెనీల‌పై ముప్పేట దాడి చేసిన ఎన్ ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ)... ఏకంగా రూ.315 కోట్ల విలువైన ఆస్తుల‌ను సీజ్ చేసింది. ఈ వార్త తెలుగు నేల‌లో పెను క‌ల‌క‌ల‌మే రేపుతోంది. నేటి ఉద‌యం నుంచే సుజ‌నా కంపెనీల్లో సోదాలు మొద‌ల‌వ‌గా... సాయంత్రానికే రూ.315 కోట్ల విలువైన సుజ‌నా ఆస్తులు సీజ్ అయిన‌ట్టు వ‌స్తున్న వార్త‌లు టీడీపీకి షాకిచ్చాయ‌నే విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. టీడీపీకి కీల‌క‌మైన ఈ ఎన్నిక‌ల్లో విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై న‌మోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల‌ను ఆధారం చేసుకుని టీడీపీ అధినేత - ఏపీ సీఎం సంచ‌న‌ల ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. టీడీపీ నేత‌లు కూడా జ‌గ‌న్ కేసుల‌నే ల‌క్ష్యంగా చేసుకుని త‌మ‌దైన శైలి విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో కీల‌క నేత‌గానే కాకుండా చంద్రబాబుకు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న సుజ‌నా చౌద‌రిపై ఈడీ దాడులు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

షెల్ కంపెనీల పేరిట బ్యాంకులను మోసగించార‌ని ఇప్ప‌టికే సుజ‌నాపై కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం రంగంలోకి దిగిన ద‌ర్యాప్తు సంస్థ‌లు సోదాలు నిర్వ‌హించినా... అప్పుడు ఆస్తుల జ‌ప్తున‌కు చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. అయితే ఇప్పుడు అది కూడా కీల‌క ఎన్నిక‌ల‌కు ముందు ఈడీ సుజ‌నా ఆస్తుల‌ను జ‌ప్తు చేస్తూ నిర్ణ‌యం తీసుకోవడం పెను సంచ‌ల‌నంగానే మారింద‌ని చెప్పాలి. నకిలీ ఆస్తులు - బోగస్ ఇన్వాయిస్ లతో బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకున్న సుజ‌నా... ఆ మొత్తాన్ని షెల్ కంపెనీలకు తరలించినట్టు తెలుస్తోంది. మహాల్ హోటల్ అనే షెల్ కంపెనీని సృష్టించి దాని ద్వారా వైశ్రాయ్ హోటల్ లిమిటెడ్ కు నిధులు తరలించినట్టు కూడా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. నేటి ఈడీ దాడుల్లో భాగంగా హైదరాబాద్ - పంజాగుట్టలోని నాగార్జున హిల్స్ లోని సుజనా ఆఫీస్ నుంచి పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు - షెల్ కంపెనీలకు చెందిన 124 నకిలీ రబ్బర్ స్టాంపులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఏకంగా రూ.315 కోట్ల విలువ చేసే సుజ‌నా ఆస్తుల‌ను కూడా ఈడీ జ‌ప్తు చేసింద‌న్న వార్త‌లు పెను ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి.