Begin typing your search above and press return to search.

ఆ రూ.133 కోట్లు ఎక్క‌డివి?

By:  Tupaki Desk   |   27 Nov 2018 7:44 AM GMT
ఆ రూ.133 కోట్లు ఎక్క‌డివి?
X
కేంద్ర మాజీ మంత్రి - టీడీపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి సంస్థ‌ల‌పై ఎన్‌ ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) సోదాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. బ్యాంకుల‌కు సుజ‌నా గ్రూప్స్ సుమారు రూ.6 వేల కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టాయ‌ని ప్రాథ‌మికంగా నిర్ధార‌ణ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ వ్య‌వ‌హారంలో క్ర‌మంగా ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేస్తున్న ఈడీ.. 2014లో సుజ‌నా చెల్లించిన రూ.133 కోట్ల రుణంపై ఆరా తీస్తున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ మిత్ర‌ప‌క్షాలుగా బ‌రిలో దిగాయి. కేంద్రంగా బీజేపీ అధికారంలోకి రావ‌డంతో టీడీపీకి 2 మంత్రి ప‌ద‌వులు ఆఫ‌ర్ చేసింది. ఆ ప‌ద‌వుల‌కు అశోక్ గ‌జ‌ప‌తిరాజు - సుజ‌నా చౌద‌రిల పేర్ల‌ను చంద్ర‌బాబు సూచించారు. గ‌జ‌ప‌తిరాజుకు మంత్రివ‌ర్గ తొలి జాబితాలో చోటు ద‌క్కిన‌ప్ప‌టికీ సుజ‌నాకు స్థానం ల‌భించ‌లేదు. కార‌ణం - బ్యాంకు రుణ ఎగ‌వేత‌దారుల జాబితాలో ఆయ‌న పేరుండ‌టం.

రుణాలు ఎగ్గొట్టిన‌వారికి తాము మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేమ‌ని.. మ‌రో ఎంపీ పేరు సూచించాల‌ని బీజేపీ చెప్పినా చంద్ర‌బాబు వినిపించుకోలేద‌ట‌. త‌మ పార్టీకి కామ‌ధేనువు లాంటి సుజ‌నాకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టార‌ట‌. ఆలోపు 2014 న‌వంబ‌రు 7న సుజ‌నా చౌద‌రి త‌న పేరు మీద సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న రూ.133 కోట్ల అప్పు తీర్చేశాడు. దీంతో ఆయ‌న మంత్రి ప‌ద‌వికి మార్గం సుగ‌మ‌మైంది. అప్పు తీర్చిన రెండు రోజుల్లోనే కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశాడు.

ఈడీ ప్ర‌స్తుతం ఈ విష‌యంపైనే ప్ర‌ధానంగా దృష్టిసారించింది. ఎందుకంటే 2013 నాటికి సుజనా గ్రూపు వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.930 కోట్లు బకాయిపడ్డాయి. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ తన నివేదికలో ఈ వివ‌రాల‌ను స్పష్టంగా పేర్కొంది. 2013–14 ఆర్థిక సంవత్సరానికి సుజనా మెటల్స్‌ రూ.38 కోట్లు, సుజనా యూనివర్సల్‌ రూ.6.3 కోట్లు - సుజనా టవర్స్‌ రూ.1.8 కోట్ల నష్టాలను ప్రకటించాయి. మరి ఇంత నష్టాల్లో ఉన్న కంపెనీలు ఒక్క‌సారిగా రూ.133 కోట్ల రుణాన్ని ఎలా తీర్చ‌గ‌లిగాయి? ఆ నిధులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి? ఈ ప్ర‌శ్న‌ల‌కు సమాధానం రాబ‌ట్ట‌గ‌లిగితే సుజ‌నా గ్రూప్స్‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌న్నీ బ‌య‌ట‌పెట్టొచ్చున‌ని ఈడీ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అందుకే ఈ నెల 27న త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ సుజ‌నా చౌద‌రిని ఈడీ ఆదేశించింది. అయితే - పార్ల‌మెంటు స‌మావేశాలుండ‌టంతో త‌న‌కు రావ‌డం వీలు కాద‌ని సుజ‌నా ఇప్ప‌టికే చెప్పేశారు.