Begin typing your search above and press return to search.

గ్రానైట్ కంపెనీల్లో ఈడీ సోదాలు.. ఏమేం బయటపడ్డాయి?

By:  Tupaki Desk   |   12 Nov 2022 4:33 AM GMT
గ్రానైట్ కంపెనీల్లో ఈడీ సోదాలు.. ఏమేం బయటపడ్డాయి?
X
తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్.. టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన కంపెనీలతో పాటు.. వారి నివాసాలు.. పలు చోట్ల ఈడీ.. ఐటీలు కలిసి సోదాలు నిర్వహించిన వైనం సంచలనంగా మారటం తెలిసిందే. సోదాలు మొదలైన గంటల వ్యవధిలోనే దుబాయ్ లో ఉన్న మంత్రి గంగుల ఉరుకులు పరుగుల మీద హైదరాబాద్ కు వచ్చేయటం.. ఈడీ తనిఖీలకు తాను పూర్తిగా సహకారం అందిస్తానని.. నిజానికి అందుకే తాను తిరిగి వచ్చేసినట్లుగా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్.. కరీంనగర్ లలో పలు చోట్ల నిర్వహించిన సోదాల్లో ఈడీకి ఏం లభించింది? ఏయే అంశాలు రానున్న రోజుల్లో సరికొత్త సంచలనాలకు తెర తీసేలా మారాయి? అన్న విషయంలోకి వెళితే.. బోలెడన్ని అంశాలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారాన్ని చూస్తే.. గ్రానైట్ సంస్థలు విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం అదేనండి.. ఫెమా రూల్స్ ను అతిక్రమించినట్లుగా ఈడీ గుర్తించినట్లుగా చెబుతున్నారు.

ఈ సంస్థలన్ని చైనా.. హాంకాంగ్తో పాటు ఇతర దేశాల్లోని కంపెనీలకు చెల్లించిన రాయల్టీకి మించిన పరిమానంలో ముడి గ్రానైట్ ను ఎగుమతి చేసినట్లుగా ఈడీ పూర్తి ఆధారాలతో నిర్దారించినట్లుగా చెబుతున్నారు. చైనాకు చెందిన లీవెన్ హ్యూ అనే వ్యాపారి ఖాతా నుంచి గ్రానైట్ యజమానుల ఖాతాల్లోకి పెద్ద ఎత్తున నగదు జమ అయినట్లుగా చెబుతున్నారు.

ఇక్కడ చెప్పాల్సిన ఆసక్తికర అంశం ఏమంటే.. ఇప్పుడు బయటకు వచ్చిన 'లీవెన్ హ్యూ’ ఎవరంటే.. ఆ మధ్యన విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన పనామా పేపర్లలో అంతర్జాతీయంగా పన్ను ఎగవేతదారుల వివరాలు వెల్లడి కావటం.. అందులోనే ఇతగాడి పేరు ఉండటం గమనార్హం. ఈడీ జరిగిన సోదాల నేపథ్యంలో ఒక అధికార ప్రకటన విడుదలైంది. అందులో హైదరాబాద్.. కరీంనగర్ కు చెందిన గ్రానైట్ కంపెనీల్లో సోదాలు నిర్వహించగా.. ఆయా కంపెనీలో పని చేసే వారి బినామీ ఖాతాల్లోకి చైనా.. హాంకాంగ్ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు జమైనట్లుగా గుర్తించారు.

అయితే..ఈ మొత్తానికి సంబంధించి వినిపిస్తున్న వాదన చిత్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. చైనా.. హాంకాంగ్ నుంచి వచ్చిన పెద్ద ఎత్తున మొత్తాన్ని చేబదులు కింద తీసుకున్నట్లు చెబుతున్నారని.. ఎలాంటి పత్రాలు లేకుండా ఇదెలా సాధ్యం? అని ప్రశ్నిస్తున్నారు. తాజా తనిఖీలతో అక్రమాల పాముల పుట్ట కదిలినట్లేనని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 నాటి నివేదిక ప్రకారం 7.68 లక్షల క్యూబిక్ మీటర్ల ఖనిజాన్ని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసినట్లుగాఈడీ వెల్లడించింది. విజిలెన్స్ నివేదిక ప్రకారం ఎగవేసిన సీనరేజ్ ఫీజు.. దానికి వేసిన పెనాల్టీతో కలిపి 729.6 కోట్లుగా తేల్చారు. అప్పటి విజిలెన్స్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేయగా.. మరిన్ని వివరాలు బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

కరీంనగర్ లోని క్వారీ లీజు ప్రాంతాల నుంచి సముద్రం.. రైలు మార్గాల్లో అక్రమంగా తరలించిన గ్రానైట్ కు సంబంధించిన రాయల్టీ చెల్లించాలని పలుమార్లు కోరినా.. ఎగుమతిదారులు చెల్లించలేదని ఈడీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ కు చెందిన నాయకులు గ్రానైట్ వ్యాపారాల్లో ఉండటం.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన గ్రానైట్ సంస్థలకు విధించిన ఫైన్ ను చెల్లించకపోవటాన్ని పలువురు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో పాటు.. ఇతర దర్యాప్తు సంస్థలకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో సోదాలు జరిగినట్లుగా చెబుతున్నారు. తాజాగా చేపట్టిన సోదాల నేపథ్యంలో పలువురికి తమ విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసింది. మొత్తంగా గ్రానైట్ కంపెనీల్లో చోటుచేసుకున్న అక్రమాలు రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ ప్రకంపనలకు కారణమవుతాయన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.