Begin typing your search above and press return to search.

గాంధీ కుటుంబం చట్టానికి అతీతులా ?

By:  Tupaki Desk   |   27 July 2022 5:17 AM GMT
గాంధీ కుటుంబం చట్టానికి అతీతులా ?
X
కాంగ్రెస్ పార్టీ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ముసుగులో మనీల్యాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న విషయం తెలిసిందే. సోనియా, రాహుల్ కు ఈడీ విచారణ నోటీసులు ఇవ్వటాన్నే పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కోర్టు నుండి వచ్చిన ఒత్తిడి కారణంగా మాత్రమే సోనియా, రాహుల్ ఈడీ విచారణకు అంగీకరించారు.

సోనియాను ఈడీ ఉన్నతాధికారులు రెండుసార్లు విచారించారు. రాహుల్ ను ఈ మధ్యనే వరసగా నాలుగు రోజులు విచారించారు. విచారణకు హాజరు కావాలని వీళ్ళకు నోటీసులు ఇవ్వటం ఒక ఎత్తు, విచారించటం మరొక ఎత్తుగా తయారైంది. వీళ్ళ విచారణ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించిందంటే సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని పార్టీ అనుకుంటున్నదో అర్ధం కావటం లేదు.

ఒకవైపు చట్టానికి అందరు సమానమే అని చెబుతునే మరోవైపు తమను మాత్రం విచారించేందుకు లేదనేట్లుగా తల్లీ, కొడుకులు ప్రవర్తిస్తుండటమే విచిత్రంగా ఉంది.

ఇలా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి నిరసనలు తెలిపే బదులు కోర్టులో తమ నిర్దోషిత్వం నిరూపించుకోవటమే మంచిదని వీళ్ళకు ఎందుకు అనిపించటం లేదో. గతంలో జైన్ హవాలా డైరీల ఆరోపణలపై ప్రధానమంత్రిగా ఉన్నపుడు పీవీ నరసింహారావు స్వయంగా కోర్టులో విచారణకు హాజరైనపుడు అప్పట్లో దేశవ్యాప్తంగా ఇలాంటి ఆందోళనలు జరగలేదు.

విచిత్రం ఏమిటంటే ఇపుడు ఆందోళనలను సమర్ధిస్తున్నవారిలో చిదంబరం, జై రామ్ రమేష్, కపిల్ సిబల్ లాంటి అత్యంత సీనియర్లలో లాయర్లు కూడా ఉండటం. లాయర్లు అయ్యుండి తమ అగ్రనేతలకు సరైన సూచనలు ఇవ్వటంలో వీళ్ళు ఫెయిలయ్యారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

చిదంబరం కూడా చాలా కేసుల్లో ఇరుక్కుని బెయిల్ పై తిరుగుతున్నారు. చట్టాలపై గౌరవం ఉన్నవారైతే ఇలాంటి ఆందోళనలను ప్రోత్సహించరు. ఈడీ విచారణ జరుగుతున్నంతసేపు దేశవ్యాప్తంగా పార్టీ ఆందోళనలు జరుగుతున్నాయంటే అర్ధమేంటి ?