Begin typing your search above and press return to search.

క్యాసినో క‌ల‌క‌లం!

By:  Tupaki Desk   |   28 July 2022 3:41 PM GMT
క్యాసినో క‌ల‌క‌లం!
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్యాసినో వ్య‌వ‌హారం మ‌రోసారి క‌ల‌క‌లం రేపింది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో సంక్రాంతి సంద‌ర్భంగా గుడివాడ‌లో క్యాసినో న‌డిచినట్టు టీడీపీ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసింది. త‌ర్వాత‌.. ఈ వ్య‌వ‌హారం.. కొంత స‌ర్దుమ‌ణిగినా.. ఇప్ప‌డు.. మ‌రోసారి.. ఈడీ సోదాలు చేయ‌డం.. హైద‌రాబాద్‌లో కూపీ లాగ‌డం.. మాధ‌వ‌రెడ్డి, ప్ర‌వీణ్‌ల ఇళ్ల‌పై దాడులు చేయ‌డం వంటి ప‌రిణామాల‌తో మ‌రోసారి.. ఈ క్యాసినో.. వ్య‌వ‌హారం.. తెర‌మీదికి వ‌చ్చింది.

తాజాగా హైదరాబాద్ క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు ముగిశాయి. విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు. ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 10 మంది సినీ తారలను నేపాల్‌కు రప్పించినట్లు.. అంతకుముందు వారితో చికోటి ప్రవీణ్‌ ప్రమోషన్ వీడియోలు చేయించినట్లు తెలుస్తోంది.

నేపాల్‌ క్యాసినోకు 10 మంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరైనట్లు ఈడీ గుర్తించింది. క్యాసినోకు రావాలంటూ పలువురు హీరోయిన్లు చేసిన ప్రమోషన్‌ వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ప్రమోషన్లకు సంబంధించి క్యాసినో నిర్వాహకుల నుంచి సినీ తారలకు అందిన పేమెంట్‌.. ఇతర ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఐఎస్‌ సదన్‌లోని ప్రవీణ్‌ ఇల్లు, కడ్తాల్‌లోని ఫాంహౌస్‌లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిం చారు. ప్రవీణ్‌ ల్యాప్‌టాప్‌, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఆయన పుట్టినరోజు వేడు కలకు పలువురు రాజకీయ నేతలు, సినీ తారలు హాజరైనట్లు గుర్తించారు. సోషల్‌ మీడియా ద్వారా క్యాసినో వీడియోలను ప్రవీణ్‌ ప్రచారం చేసినట్లు తేల్చారు. జనవరిలో గుడివాడ గ్యాంబ్లింగ్‌లోనూ ఆయన హస్తం ఉన్నట్లు గుర్తించారు. నేపాల్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ క్యాసినోలకు పలువురిని తీసుకెళ్లినట్లు ఈడీ అధికారుల విచారణలో తేలింది.

క్యాసినో వ్యవహారంపై నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ స్పందించారు. ఈడీ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని.. సోమవారం మళ్లీ విచారణకు హాజరుకావాలని చెప్పినట్లు తెలిపారు.

"గోవా, నేపాల్‌లో క్యాసినో లీగల్ కాబట్టే నిర్వహించాం. క్యాసినోపై ఈడీ అధికారులకు సందేహాలున్నాయి. వాటి గురించి వివరణ అడిగారు. సోదాల్లో అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పాను. నాకు ఈడీ నోటీసులు ఇచ్చారు. రేపు వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను`` అని ప్ర‌వీణ్‌వ్యాఖ్యానించాడు.

బ‌య‌ట ప‌డ్డ గుట్టు..

ప్రవీణ్‌ వ్యవహారంలో అన్ని లింకులు బయటపడుతున్నాయి. ఏపీ, తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ ఛైర్మన్లు ఉన్నారని తేలింది. నేపాల్‌కు వెళ్లిన కస్టమర్లలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రవీణ్‌ ల్యాప్‌ట్యాప్‌లో వీఐపీల భాగోతాలు బయటపడ్డాయి. అలాగే చెన్నైకి చెందిన బంగారం వ్యాపారికి హవాలా ఏజెంట్‌గా చికోటి వ్యవహరిస్తున్నారు. ఒక్కో దేశానికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారు. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్‌లో అడ్డాలున్నాయిట‌!.

కోల్‌కతా మీదుగా నేపాల్‌కు కస్టమర్లను పంపిస్తున్నారు. ఒక్కో విమానానికి రూ. 50 లక్షలు, ఒక్కో హోటల్‌కు 40 లక్షలు చెల్లిస్తున్నారు. ఒక్కో కస్టమర్ల నుంచి రూ.5 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. చికోటి ప్రవీణ్‌‌కు సుమారు 200 మంది రెగ్యులర్‌ కస్టమర్లు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

ఎవ‌రీ మాధ‌వ‌రెడ్డి?

ఒకప్పుడు పాలు, పెరుగు అమ్ముతూ సాదాసీదాగా జీవించిన మాధవరెడ్డి.. క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడి దాంట్లో లక్షల రూపాయలు కోల్పోయినట్టు సమాచారం. అతడికి హైదరాబాద్‌లోని ఓ మంత్రి సోదరుడితో పరిచయం ఉందని అంటారు. అతడి ద్వారా.. కొంపల్లిలోని ఎస్ఎన్ఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన ఓ హైప్రొఫైల్‌ కిట్టీ పార్టీలో చీకోటి ప్రవీణ్‌తో మాధవరెడ్డికి పరిచయమైందని తెలిసింది. తర్వాత ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లోని పలు ఫంక్షన్‌ హాళ్లలో గుట్టుచప్పుడు కాకుండా క్యాసినోలు, క్యాబరేడ్యాన్స్‌లు నిర్వహిస్తున్నారని ఈడీ గుర్తించింది.

అంతా నేర‌చ‌రిత్రే!

సైదాబాద్‌లోని వినయ్‌నగర్‌ కాలనీకి చెందిన చీకోటి ప్రవీణ్‌కు నేరచరిత్ర ఉందని స‌మాచారం. ఇరవై ఏళ్ల క్రితం చిన్న సిరామిక్‌టైల్స్‌ వ్యాపారిగా ఉన్న ప్రవీణ్‌.. తర్వాత నిర్మాతగా మారి సినిమా తీసి, విలన్‌గా నటించి దివాలా తీశాడు. అప్పుల ఊబిలో చిక్కుకుపోయి దాన్నుంచి బయటపడేందుకు వనస్థలిపురంలో ఒక డాక్టర్‌ను కిడ్నాప్‌ చేశాడు. ఆ కేసులో జైలుకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత.. గోవాలో ఓ పేకాట క్లబ్బులో కొన్ని టేబుళ్లను లీజుకు తీసుకుని జూద నిర్వహణలో ప్రస్థానం ప్రారంభించాడు.

ఆతర్వాత అంచెలంచెలుగా తన క్యాసినా సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్లకు పడగలెత్తాడు. రాజకీయ, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన ప్రముఖులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలోనే.. చినజీయర్‌ స్వామిని ప్రవీణ్‌ ఒక కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు ఇటీవల వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.