Begin typing your search above and press return to search.

న‌టి ఇంట్లో రూ.20 కోట్ల కుంభ‌కోణం డ‌బ్బు.. ఎవ‌రీ అర్పిత‌?

By:  Tupaki Desk   |   23 July 2022 4:00 AM GMT
న‌టి ఇంట్లో రూ.20 కోట్ల కుంభ‌కోణం డ‌బ్బు.. ఎవ‌రీ అర్పిత‌?
X
మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప‌శ్చిమ బెంగాల్ లో తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన దాడులు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న‌ పార్థా ఛటర్జీకి అత్యంత‌ ఆప్తురాలు, సినిమా న‌టి అర్పిత ముఖర్జీ ఇంట్లో రూ.20 కోట్లు ల‌భించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇంకా విదేశీ క‌రెన్సీ, లెక్క తెలియ‌నంత బంగారం, ప‌లు ఆస్తుల‌కు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు ల‌భించాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పార్థా ఛటర్జీపై పలు ఆరోపణలు ఉన్నాయి. స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలో టీచర్ల నియామకాలకు సంబంధించి ఆయన అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వ‌స్తున్నాయి. ఆయ‌న‌పై కూడా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.

30 ఏళ్ల అర్పిత ముఖర్జీ.. మంత్రి పార్థా ఛటర్జీకి బాగా దగ్గరైన మనిషిగా చెబుతోంది.. ఈడీ. బెంగాలీ, ఒడియా, తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లోనూ ఆమె నటించార‌ని చెబుతున్నారు. బెంగాలీలో ఒకటి రెండు పెద్ద చిత్రాల్లోనూ అర్పిత ముఖ‌ర్జీ న‌టించారు. ఆమె ఫేస్‌బుక్‌ బయోలో మల్టీ టాలెంటెడ్‌ అని ఉంద‌ని చెబుతున్నారు. పార్థా ఛటర్జీ నిర్వహించే దుర్గా పూజల కమిటీ ‘నాట్కల ఉదయన్‌ సంఘ’కు ఆమె ప్రచారకర్తగానూ వ్యవహరించ‌డం గ‌మ‌నార్హం.

చిన్న‌చిన్న పాత్ర‌లు వేసే అర్పిత ఇంట్లో తాజా ఈడీ దాడుల్లో రూ.20 కోట్ల న‌గదు ల‌భించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇదంతా బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ నియామకాలు, ప్రైమరీ ఎడ్యుకేషన్‌ బోర్డులో అవకతవకల నేరాలకు సంబంధించిన డబ్బుగా అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తం రూ.20 కోట్ల‌కు సంబంధించి అన్నీ 500, 2 వేల నోట్ల కట్టలే ల‌భించాయి. దీంతో బ్యాంక్‌ అధికారుల సాయంతో ఈ డబ్బును లెక్కించాల్సి వ‌చ్చింది.

కాగా ఈడీ సోదాల్లో ఇరవైకి పైగా మొబైల్‌ ఫోన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. న‌టి అర్పిత ముఖ‌ర్జీతో పాటు విద్యాశాఖ మంత్రి పరేష్‌ అధికారే, ఎమ్మెల్యే మాణిక్‌ భట్టాచార్య.. తదితరుల ఇళ్లలోనూ ఈడీ దాడులు కొనసాగాయి. ప్రస్తుతం ఆ ఫొటోల‌ను మీడియా ప్ర‌చురించింది. మ‌రోవైపు బీజేపీ నేత సువేందు అధికారి.. న‌టి అర్పిత ముఖ‌ర్జీ, మంత్రి పార్థ చ‌ట‌ర్జీ, ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఒకే వేదిక‌పై ఉన్న ఫొటోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు.

మ‌రోవైపు ఈడీ దాడుల‌పై తృణ‌మూల్ కాంగ్రెస్ మండిప‌డింది. ఇదంతా బీజేపీ కుట్ర అని అంటోంది. మ‌రోవైపు న‌టి అర్పిత ముఖ‌ర్జీ.. మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీతో అత్యంత స‌న్నిహితంగా ఫొటోలను మీడియాకు విడుదల చేసి వారిద్ద‌రి బంధాన్ని బ‌హిర్గ‌తం చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ వివాదం ఎన్ని మ‌లుపులు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.