Begin typing your search above and press return to search.

ఈడీకే ప‌దునెక్కువ‌.. దానిష్టం: సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు

By:  Tupaki Desk   |   27 July 2022 8:13 AM GMT
ఈడీకే ప‌దునెక్కువ‌.. దానిష్టం:  సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు
X
ఇప్పుడు ఎక్క‌డ విన్నా.. ఈడీ.. ఈడీ..పేరు మార్మోగుతోంది. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుకు అను కూలంగా లేని వారిపైఈడీని ప్ర‌యోగిస్తున్నారంటూ..కొన్నాళ్లుగా విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై రాజ‌కీయ నేత‌లు.. తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. ఇక‌, తాజాగా ఈడీ అధికారులు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని వ‌రుస‌గా రెండో రోజు కూడా విచారిస్తున్నారు. దీనిని వ్య‌తిరేకిస్తూ.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయ‌కులు ఉద్య‌మిస్తున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో ఈడీ(ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్) అధికారుల‌ను ప్ర‌శ్నిస్తూ.. దాఖ‌లైన పిటిష‌న్ల‌పై సుప్రీం కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈడీకి ప‌దునెక్కువేన‌ని కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది.

ఈడీ అధికారాలను తప్పుపడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కార్తీ చిదంబరం, మోహబూబా ముఫ్తీ వంటి నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అధికారాలను సుప్రీం సమర్థించింది. కారణాలు చెప్పకుండానే నిందితులను అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదన్న వాదనను కొట్టిపారేసింది.

మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని కీలక నిబంధనలను సుప్రీంకోర్టు సమర్థించింది. పలు నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది. ఈ చట్టాన్ని అమలు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తన దర్యాప్తులో భాగంగా చేస్తున్న సోదాలు, అరెస్టులు, ఆస్తుల సీజ్‌ వంటి అన్ని చర్యలను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.

కారణాలు చెప్పకుండానే నిందితులను అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదన్న వాదనను కూడా సుప్రీం కొట్టిపారేసింది. విచారణ సమయంలో బలవంతంగా వాంగ్మూలాలు నమోదు చేస్తోందని కార్తీ చిదంబరం, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వంటి పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకురాగా ఆ వాదనను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసు సమాచార నివేదిక- ఈసీఐఆర్ను నిందితులకు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది.

అంతేకాదు.. అది ఎఫ్ఐఆర్తో సమానమని స్పష్టం చేసింది. ఆరోపణలపై ఆధారాల కోసం నిందితుడిపై ఒత్తిడి చేయడం అంటే అతడి ప్రాథమిక హక్కు, జీవించే హక్కును హరించడమేనని పిటిషనర్లు వాదించగా దేశ సమగ్రత, సౌభ్రాతృత్వానికి సవాళ్లుగా మారిన ఆర్థిక నేరాలను కట్టడి చేయాలంటే ఇలాంటి ఒత్తిళ్లు తప్పవని కేంద్రం పేర్కొంది. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఈడీ అధికారాలను సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.