Begin typing your search above and press return to search.

నేను తప్పు చేయలేదు.. ఈడీ విచారణలో అనిల్ అంబానీ

By:  Tupaki Desk   |   19 March 2020 8:10 AM GMT
నేను తప్పు చేయలేదు.. ఈడీ విచారణలో అనిల్ అంబానీ
X
ఎస్ బ్యాంక్ సంక్షోభం.. రుణాల ఎగవేత వంటి అంశాలపై రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా సమన్లు అందడంతో మహారాష్ట్రలోని ముంబయిలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరెట్‌) ఎదుట విచారణకు హాజరయ్యారు. అనిల్‌ అంబానీకి చెందిన 9 కంపెనీలు ఎస్‌ బ్యాంక్‌ నుంచి రూ.12,800 కోట్లు రుణాలు పొందాయి. తీసుకున్న రుణాలు చెల్లించలేదు. ప్రస్తుతం ఆయన దివాళ తీసి రుణాలు చెల్లించలేని పరిస్థితలో కూరుకుపోయాడు. ఆ సమయంలోనే ఎస్ బ్యాంక్ కూడా సంక్షోభం బారిన పడింది. ఈ నేపథ్యంలో దీనికి ఒక కారకుడిగా భావిస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అనిల్ అంబానీని విచారణకు పిలిచింది. తన కంపెనీలు సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో నిరర్థక ఆస్తుల జాబితాలోకి చేరాయని ఈడీ గుర్తించి అనిల్ అంబానీని విచారణకు ఆహ్వానించింది.

అయితే ఇప్పటికే ఎస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను మనీ లాండరింగ్‌ కేసులో అధికారులు విచారిస్తున్నారు. నిరర్థక ఆస్తులు ఎక్కువైన కారణంగానే ఎస్‌ బ్యాంక్‌ సంక్షోభంలోకి వెళ్లిందని ఆర్థిక నిపుణులు, కేంద్ర సంస్థ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ కూడా విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆయన కంపెనీ ఆస్తులు కూడా నిరర్ధకం కావడంతో అనిల్ అంబానీని ఈడీ పిలిచింది. వాస్తవానికి ఈ వారం ప్రారంభంలోనే అంబానీ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాలి. కానీ అనారోగ్య కారణాలతో తాను హాజరు కాలేనని ఈడీకి సమాచారం ఇచ్చారు. అయితే తాజా సమన్ల మేరకు ఆయన గురువారం ఈడీ ఎదుట హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన వాంగ్మూలాన్ని వినిపించారు.

రానా కపూర్ ఎస్ బ్యాంకు సీఈఓగా ఉన్నప్పుడు నిబంధనలు ఉల్లంఘించి ఎవరెవరికి, ఏయే కంపెనీలకు రుణాలు ఇచ్చారో.. అనిల్ అంబానీ నుంచి అధికారులు తెలుసుకున్నారని సమాచారం. అయితే రానాకపూర్ కుటుంబం తో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఎస్ బ్యాంకు నుంచి తాము కేవలం రుణాలు తీసుకున్నామని, వాటిని తిరిగి చెల్లించేందుకు సిధ్ధంగా ఉన్నట్లు ఈడీకి తెలిపినట్లు తెలుస్తోంది. తమ లావాదేవీలన్నీ పూర్తి నిబంధనల మేరకే జరిగాయని ఈ సందర్భంగా రిలయన్స్ గ్రూప్ సంస్థ వివరణ ఇచ్చుకుంది. ప్రతి ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది.