Begin typing your search above and press return to search.

తెలంగాణ గ్రానైట్ కంపెనీలపై విచారణ జరపాలంటూ సీబీఐకి ఈడీ లేఖ..!

By:  Tupaki Desk   |   6 Jan 2023 6:44 AM GMT
తెలంగాణ గ్రానైట్ కంపెనీలపై విచారణ జరపాలంటూ సీబీఐకి ఈడీ లేఖ..!
X
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నేతల మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తోంది. ఎవరికీ వారు తగ్గెదేలే అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. కేంద్రంలోని బీజేపీ వైఫల్యాలపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తుంటే రాష్ట్రంలోని అవినీతి పాలన సాగుతోందని స్థానిక బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్.. బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో బీజేపీకి టీఆర్ఎస్ చెక్ పెట్టాలని చూసింది. ఇక కేంద్రంలోని బీజేపీ టీఆర్ఎస్ నేతల అవినీతి అక్రమాల చిట్టాను బయటకు తీసేందుకు ఈడీ.. సీబీఐని రంగంలోకి దింపుతోంది.

ఇప్పటికే కేసీఆర్ కూతురు కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటుంది. మరోవైపు అధికార పార్టీ నేతలు.. మంత్రుల ఇళ్లు.. కార్యాలయాలపై ఇటీవల ఈడీ సహా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆడిట్ నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలోనే వేల కోట్ల అవినీతి స్కాంలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

ఇందులో భాగంగానే ఈడీ తెలంగాణలోని గ్రానైడ్ కంపెనీలపై నజర్ పెట్టింది. ఈ కంపెనీలకు సంబంధించిన పలు కీలక ఆధారాలు సేకరించింది. అధికార పార్టీకి చెందిన కొందరు నేతల చేతుల్లోని గ్రానైట్ కంపెనీల్లో పెద్దఎత్తున అవినీతి జరిగినట్లు గుర్తించింది. దొంగ లెక్కలు.. తప్పుడు పత్రాలపై కేంద్రానికి పన్ను రూపంలో రావాల్సిన రూ.800 కోట్లను ఎగవేసినట్లు తేల్చినట్లు సమాచారం.

ఈ మేరకు రాష్ట్రంలోని శ్వేత ఏజెన్సీ.. జేఎం బాక్సీ.. మైధిలి ఆదిత్య ట్రాన్స్పోర్ట్.. అరవింద గ్రానైట్.. ఎఎస్ యూవై షిప్పింగ్.. పీఎస్సార్ ఏజెన్సీస్.. షాండియా ఏజెన్సీస్.. కె.వి.ఎ ఎనర్జీ .. శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్.. గాయత్రి మైన్స్ పై సీబీఐ విచారణ చేపట్టాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీబీఐకి తాజాగా లేఖ రాసింది. దీంతో అధికార పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది.

ఇప్పటికే ఈడీ అధికారులు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు సంబంధించిన గ్రానైట్ కంపెనీలు.. రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవికి సంబంధించిన గాయత్రి గ్రానైట్స్ పై దాడులు చేసి కీలక ఆధారాలను సేకరించారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు సీబీఐకి తెలంగాణ గ్రానైట్ సంస్థల పై విచారణ జరపాలని లేఖ రాయడం రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు టర్న్ తీసుకుంటాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.