Begin typing your search above and press return to search.

విద్యాశాఖ మంత్రికి విద్యార్థుల సెగ‌.. ప‌రీక్ష‌ల‌పై పున‌రాలోచించాలంటూ..

By:  Tupaki Desk   |   5 July 2021 9:41 AM GMT
విద్యాశాఖ మంత్రికి విద్యార్థుల సెగ‌.. ప‌రీక్ష‌ల‌పై పున‌రాలోచించాలంటూ..
X
తెలంగాణ విద్యాశాఖ‌ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డికి విద్యార్థుల నుంచి ఊహించ‌ని సెగ త‌గిలింది. ప‌రీక్ష‌ల‌పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌డ‌లించాల‌ని డిమాండ్ చేస్తూ.. హైద‌రాబాద్ లోని ఎడ్యుకేష‌న్ మినిస్ట‌ర్ స‌బితా ఇంద్రారెడ్డి నివాసాన్ని ముట్టించారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ, జేఎన్టీయూ విద్యార్థులంతా.. మంత్రి స‌బిత ఇంటికి ర్యాలీగా చేరుకున్నారు. స‌త్య‌సాయి నిగ‌మాగ‌మం నుంచి మొద‌లైన ర్యాలీ.. విద్యాశాఖ మంత్రి స‌బిత ఇంటి వ‌ర‌కు కొన‌సాగింది.

అనంత‌రం మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఇంటి ఎదుట ధ‌ర్నా నిర్వ‌హించారు. ఇంజ‌నీరింగ్, డిగ్రీ ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని, కుద‌ర‌క‌పోతే.. ఆన్ లైన్లో నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కూడా విద్యార్థుల‌కు పూర్తిగా టీకాలు వేసిన త‌ర్వాతే చేప‌ట్టాల‌ని కోరారు. క‌రోనా వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా.. సాధార‌ణ ప‌ద్ధ‌తిలో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే.. క‌రోనా వ్యాపించే అవ‌కాశం ఉంద‌ని ఉస్మానియా యూనివ‌ర్సిటీ, జేఎన్టీయూ విద్యార్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు అంద‌రూ 18 నుంచి 25 ఏళ్ల మ‌ధ్య‌నే ఉంటార‌ని చెప్పారు. ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాబోతున్న డిగ్రీ, ఇంజ‌నీరింగ్ విద్యార్థులు అంద‌రికీ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ఇవ్వ‌క‌పోతే.. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ వాయిదా వేయాల‌ని డిమాండ్ చేశారు. క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టు అనిపిస్తున్న‌ప్ప‌టికీ థ‌ర్డ్ వేవ్ భ‌యాలు వ్య‌క్త‌మ‌వుతున్నామ‌ని, అదే స‌మ‌యంలో బ్లాక్ ఫంగ‌స్ వంటివి కూడా భ‌య‌పెడుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి స‌మ‌యంలో ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయ‌డ‌మే మంచిద‌ని అన్నారు.

ఇంట‌ర్ ప‌రీక్ష‌లు వాయిదా వేసిన‌ప్పుడు.. డిగ్రీ, ఇంజ‌నీరింగ్ ప‌రీక్ష‌ల‌ను మాత్రం ఎందుకు నిర్వ‌హిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ప‌రీక్ష‌ల నిర్వహ‌ణ మొద‌లైన త‌ర్వాత థ‌ర్డ్ వేవ్ విజృంభిస్తే.. ఏం చేస్తార‌ని ప్ర‌శ్నించారు. కోర్టు సైతం ఏపీ ప‌రీక్ష‌ల విష‌యంలో ఇదే చెప్పింద‌ని అన్నారు. దీంతో.. మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్పందించి, విద్యార్థుల‌తో మాట్లాడారు.

ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు చెప్పారు. అయితే.. విద్యార్థుల భ‌ద్ర‌త‌కు సంబంధించిన విష‌యంలో అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకున్న‌ట్టు తెలంగాణ‌ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. విద్యార్థులు కోరిన చోట‌నే ప‌రీక్ష‌లు రాసే అవ‌కాశాన్ని క‌ల్పించిన‌ట్టు చెప్పారు. ప‌రీక్షా కేంద్రాలు వారు ఎక్క‌డ కావాలంటే.. అక్క‌డే ఉండేలా చూస్తామ‌న్నారు. విద్యార్థుల ఆరోగ్యంతోపాటు ఇత‌ర అంశాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని.. ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌నే నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మంత్రి స‌బిత చెప్పారు.

ఇలాంటి నిర్ణ‌యాన్ని ఇప్ప‌టికిప్పుడు మార్చ‌డం సాధ్యం కాద‌ని మంత్రి తెలిపారు. ఖ‌చ్చితంగా విద్యార్థుల‌కు అన్ని విధాలా స‌రైన ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌ని అన్నారు. అయితే.. ఉస్మానియా, జేఎన్టీయూ విద్యార్థులు మాత్రం త‌మ ఆందోళ‌న విర‌మించ‌లేదు. మంత్రి స‌మాధానంతో సంతృప్తి చెంద‌ని విద్యార్థులు.. త‌మ ఆందోళ‌న కొన‌సాగించారు. మంత్రి వెళ్లిపోయిన త‌ర్వాత కూడా వారు ఆందోళ‌న కొన‌సాగించ‌డంతో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. ఏపీలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై న్యాయ‌స్థానం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా నేప‌థ్యంలో హ‌డావిడిగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ప్ర‌శ్నించింది. ఇదే విష‌యాన్ని ప‌లువురు విద్యార్థులు ప్ర‌స్తావించారు. ప‌రీక్ష‌లు మొద‌లు పెట్టిన త‌ర్వాత థ‌ర్డ్ వేవ్ వ‌స్తే ఏం చేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ అనేది కేవ‌లం విద్యార్థుల‌కు మాత్ర‌మే సంబంధించిన అంశం కాద‌ని అంటున్నారు. క‌ళాశాల‌ల అధ్యాప‌కులతోపాటు త‌ల్లిదండ్రులు కూడా వ‌స్తుంటార‌ని, ఏ మాత్రం తేడావ‌చ్చినా.. వైర‌స్ విజృంభించేందుకు అవ‌కాశం ఉంటుంద‌నే ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కానీ.. ప్ర‌భుత్వం మాత్రం ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ప్ర‌క‌టించింది.