Begin typing your search above and press return to search.

చదువెందుకు..?పూలన్‌ దేవి పొలిటీషియన్ కాలేదా?

By:  Tupaki Desk   |   29 Sep 2018 4:40 AM GMT
చదువెందుకు..?పూలన్‌ దేవి పొలిటీషియన్ కాలేదా?
X
కాంగ్రెస్ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. పార్టీలకతీతంగా ప్రజలు - ప్రభుత్వాలు ఇప్పుడు చదువు అవసరాన్ని.. మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు చదువు అవసరాన్ని గుర్తిస్తున్న సమయంలో ఆమె అందుకు భిన్నమైన కామెంట్లు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఛత్తీస్ గఢ్ కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఛాయా వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.

చత్తీస్‌ గఢ్‌ లోని రాయ్‌ పూర్‌ లో యూత్ కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. జీవితంలో చదువుకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన పనేమీ లేదన్నారు. ఎటువంటి చదువులు చదువుకోకపోయినా దొంగ నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగిన పూలన్ దేవిని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ‘‘పూలన్ దేవినే తీసుకోండి.. ఆమె ఏం చదువుకుంది. బందిపోటు దొంగ నుంచి రాజకీయ నేతగా ఎదిగింది. చాలా పేరు సంపాదించుకుంది. కాబట్టి గుర్తింపు కోసం స్వీయ డిగ్రీలు ఉండాల్సిన పనిలేదు’’ అని ఆమె పేర్కొన్నారు.

విద్యాభివృద్ధికి - అక్షరాస్యత పెంపునకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుంటే.. ఛాయావర్మ ఏకంగా చదువే అక్కర్లేదని చెప్పడంపై విమర్శల జడివాన కురుస్తోంది. ఎంపీగా ఉండి ఇలాంటి బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శిస్తున్నారు. కాగా గతంలోనూ ఛాయా వర్మ చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న చత్తీస్‌ గఢ్‌ పై కాంగ్రెస్ పార్టీ భారీ ఆశలు పెట్టుకున్న తరుణంలో పార్టీ నేతలు ఇలా తలాతోకా లేకుండా మాట్లాడుతుండడం ఆ పార్టీని కలవరానికి గురిచేస్తోంది.