Begin typing your search above and press return to search.

ఇదేం లెక్క?; ఈనాడు + సాక్షి = 30 లక్షలు

By:  Tupaki Desk   |   27 July 2016 10:30 PM GMT
ఇదేం లెక్క?; ఈనాడు + సాక్షి = 30 లక్షలు
X
తూర్పు పడమరలు కలుస్తాయా? ఉత్తర దక్షిణ ధ్రువాలు దగ్గరకు వస్తాయా? ఏ మాత్రం సంబంధం లేని ఈనాడు..సాక్షిలు రెండు కలవటం ఏమిటి? 30 లక్షల లెక్కేందన్న సందేహం కలుగుతుంది. కానీ.. విషయం మొత్తం తెలిశాక.. ఓహో అనటం ఖాయం. ఇంతకీ ఈ ఇద్దరు ప్రత్యర్థులు కలిసి 30 లక్షల లెక్కలోకి వస్తే.. తాజాగా ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) దేశంలోని పత్రికలకు సంబంధించిన సర్క్యులేషన్ లెక్కల్ని వెల్లడించింది. ఈ నివేదికలో దేశం మొత్తమ్మీదా పత్రికల లెక్కలతో పాటు.. తెలుగు పత్రికల సర్య్కులేషన్ వివరాలు బయటకు వచ్చాయి. దేశం విషయాన్ని పక్కన పెట్టి.. తెలుగు దినపత్రికల వ్యవహారాన్ని చూస్తే.. ఎప్పటిలానే ‘‘ఈనాడు’’ అగ్రస్థానంలో నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈనాడు సర్య్కూలేషన్ మిగిలిన పత్రికలకు అందనంత దూరంలో ఉండటం.

తెలుగులో మొత్తం దినపత్రిల సర్క్యులేషన్ 40 లక్షల కాపీలుగా తేల్చారు. ఇందులో ఈనాడు 18 లక్షల (ప్రతిరోజూ అమ్ముడయ్యే పేపర్లు) తో అగ్రస్థానంలో నిలవగా.. సాక్షి 11.5లక్షల సర్య్కులేషన్ ఉన్నట్లు తేల్చారు. ఒకప్పుడు ఈ రెండు దినపత్రికల మధ్య వ్యత్యాసం దాదాపు లక్ష కంటే తక్కువ వచ్చిన స్థాయి నుంచి.. ఈ రోజు 6.5లక్షలకు పెరగటం గమనార్హం. ఇక.. ఈ రెండు అగ్ర దినపత్రికలు కలిపి 30 లక్షల సర్య్కులేషన్ తో నిలిస్తే.. మిగిలిన దినపత్రికలైన.. ఆంధ్రజ్యోతి..నమస్తే తెలంగాణ.. వార్త.. ఆంధ్రభూమి.. కమ్యునిస్ట్ పత్రికలతో పాటు అన్ని పేపర్ల సర్క్యులేషన్ కేవలం 10 లక్షలు మాత్రమే ఉండటం గమనార్హం. తాజా లెక్కతో రామోజీ మరోసారి మీడియా మొఘల్ అని.. తనకు తిరుగే లేదని తేల్చి చెప్పినట్లైంది.

ఇక.. జాతీయ స్థాయిలో లెక్కల్లోకి వెళితే.. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే దినపత్రికగా దైనిక్ భాస్కర్ నిలిచింది. ఈ పత్రిక అనునిత్యం 38 లక్షల పత్రికల్ని అమ్ముతున్నట్లుగా తేలింది. దీని తర్వాతి స్థానంలో దైనిక్ భాస్కర్ నిలిచింది. ఇక.. ఇంగ్లిషు విభాగంలో టైమ్స్ ఆఫ్ ఇండియా 30 లక్షల ప్రతులతో మొదటిస్థానంలో నిలిచింది.