Begin typing your search above and press return to search.

ఈట‌ల పిక్చ‌ర్ క్లియ‌ర్‌.. కేంద్ర‌మంత్రి హింట్‌!

By:  Tupaki Desk   |   26 May 2021 7:36 AM GMT
ఈట‌ల పిక్చ‌ర్ క్లియ‌ర్‌.. కేంద్ర‌మంత్రి హింట్‌!
X
ఈట‌ల భ‌విష్య‌త్ కార్యాచర‌ణ ఏంటీ? మంత్రివర్గం నుంచి తప్పించిన రోజు నుంచీ ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ ప్ర‌శ్న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక స‌మాధానం రాలేదు. కానీ.. విశ్లేష‌ణ‌లు మాత్రం వెయ్యిన్నొక్క మార్గాల‌ను చూపించాయి. ఈట‌ల వేసే అడుగుల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్న‌ రాజ‌కీయ ప‌రిశీల‌కులు.. దాని వెనుక ఆంత‌ర్యాన్ని త‌మ‌దైన రీతిలో వివ‌రిస్తూ వ‌చ్చారు. అయితే.. ఇప్పుడు నేరుగా కేంద్రం మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత కిష‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌తో అస‌లు విష‌యం తేలిపోయింద‌ని అంటున్నారు.

ఈట‌ల వైపు నుంచి చూసుకున్న‌ప్పుడు.. కేసీఆర్ ముఖ్య‌మంత్రి మాత్ర‌మే కాదు. చాలా అంశాలు చ‌ర్చ‌కు వ‌స్తాయి. టీఆర్ఎస్ అధినేతగా.. ఉద్య‌మ స‌హ‌చ‌రుడిగా.. మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడిగా.. దాదాపు 20 సంవ‌త్స‌రాలు వీళ్లు క‌లిసి ప‌నిచేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ప‌డ‌గొట్టేందుకు విప‌క్షాలు ఎంత‌గానో ఎదురు చూస్తున్న వేళ‌.. ఈట‌ల అందివ‌చ్చిన ఆయుధంలా మారాడు. అలాంటి ఆయుధాన్ని త‌మ అమ్ముల పొదిలో చేర్చుకోవాల‌ని ప్ర‌ధాన పార్టీలు చూస్తున్నాయ‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేనే లేదు.

కానీ.. ఈట‌ల ఈ ప‌రిస్థితుల్లో ఏదో ఒక పార్టీలో చేరితే.. త‌న అస్తిత్వాన్ని కోల్పోయే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. ఇవాళ కాక‌పోతే రేపు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిందే. అప్పుడు ఈట‌ల మ‌రో పార్టీ గుర్తుపై పోటీ చేస్తే.. ఆయ‌న సొంతంగా టీఆర్ఎస్ ను ఎదుర్కొన్న‌ట్టు లెక్క‌లోకి రాదు. కేసీఆర్ ను స‌వాల్ చేసిన‌ట్టు కూడా కాదు. అందుకే.. ఏం చేసైనా స్వ‌తంత్ర అభ్య‌ర్థిగానే ఈట‌ల బ‌రిలోకి దిగాల్సిన ప‌రిస్థితి.

అదే జ‌రిగితే.. ఈట‌ల గెలుపు అవ‌కాశాలు ఎంత అన్న‌ది ప్ర‌శ్న‌. హుజూరాబాద్ ఉప ఎన్నిక అంటూ జ‌రిగితే.. అక్క‌డ గెలుపు జెండా ఎగ‌రేయ‌డానికి మొత్తం ప్ర‌భుత్వ‌మే వాలిపోతుంద‌ని చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కాబ‌ట్టి.. స్థానికంగా ఎంత పట్టున్నా.. స‌ర్కారు బ‌ల‌గం ముందు ఈట‌ల నిల‌వ‌డం క‌ష్ట‌సాధ్యం అన్న‌ది అభిప్రాయం. ఇది ఈట‌ల తెలియ‌నివాడేం కాదు. అందుకే.. ఆయ‌న ప్ర‌ధాన పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే.. కాంగ్రెస్ నేత‌ల‌తో మాట్లాడారు. బీజేపీ నేత‌ల‌తోనూ ఓ రౌండ్ చ‌ర్చ‌లు ముగిశాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఇప్పుడు కేంద్రం మంత్రి కిష‌న్ రెడ్డితో భేటీ కాబోతున్నాడ‌ని, ఇదే జ‌రిగితే బీజేపీలోకి వెళ్ల‌డం ఖాయ‌మేన‌నే ప్ర‌చారం సాగింది. అయితే.. తాజాగా కిష‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈట‌ల త‌న‌ను క‌ల‌వాల‌ని క‌బురు పంపిన విష‌యం వాస్త‌వ‌మేన‌ని తేల్చారు. ఇందులో త‌ప్పేముంద‌ని కూడా ప్ర‌శ్నించారు. తాము స‌హ‌చ‌రుల‌మ‌ని చెప్పుకొచ్చారు. అయితే.. ఇక్క‌డే ఓ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు కిష‌న్ రెడ్డి.

హుజూరాబాద్ కు ఉప ఎన్ని జ‌రిగితే.. త‌మ పార్టీ పోటీ చేయాలా? లేదా? అన్న విష‌యంపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని ప్ర‌క‌టించారు. ఇది సాధార‌ణ ప్ర‌క‌ట‌న కాదు. తెలంగాణ‌లో బీజేపీకి ఊపు తెచ్చిందే.. దుబ్బాక ఉప ఎన్నిక‌. ఆ మైలేజ్ తోనే.. అధికారానికి తాము అడుగు దూరంలో ఉన్నామ‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు క‌మ‌ల‌నాథులు. అవ‌కాశం వ‌చ్చిన‌ప్ర‌తిసారీ.. టీఆర్ఎస్ ను ఓడించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అలాంటిది.. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో పోటీపై నిర్ణ‌యం తీసుకోవ‌డం ఏంటీ? అన్న ప్ర‌శ్న‌ రాక‌మాన‌దు.

అంటే.. ఈట‌ల‌కు మ‌ద్ద‌తు ఇచ్చే ఆలోచ‌న బీజేపీలో సాగుతోంద‌న్న‌ది తేలిపోయింద‌ని అంటున్నారు. కాంగ్రెస్ లోనూ ఓ వ‌ర్గం ఈట‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని చూస్తోంద‌ని ప్ర‌చారం సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. హుజూరాబాద్ లో ఈట‌ల ఇండిపెండెంట్ గా నిల‌బ‌డ‌డం.. ప్ర‌ధాన పార్టీలు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం అనేది ఖాయం అయిన‌ట్టేనా? అనే చ‌ర్చ సాగుతోంది. ఈట‌ల ఎపిసోడ్ ను వినియోగించుకొని, టీఆర్ఎస్ బ‌లం త‌గ్గింద‌నే అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి తేవ‌డానికి ఇదే మంచి మార్గం అని భావిస్తున్నార‌ట కొంద‌రు నేత‌లు. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.