Begin typing your search above and press return to search.

ఇలాంటి వ్యాఖ్య‌లే క‌దా.. సోమును వీక్ చేస్తోంది!

By:  Tupaki Desk   |   13 Aug 2021 1:02 PM GMT
ఇలాంటి వ్యాఖ్య‌లే క‌దా.. సోమును వీక్ చేస్తోంది!
X
ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు.. సోము వీర్రాజుపై అనేక వ్యాఖ్య‌లు ఉన్నాయి. ఆయ‌న చెప్పేదానికి, క్షేత్ర‌స్థాయిలో జ‌రిగే దానికి ఎక్క‌డా సంబంధం ఉండ‌ద‌ని.. అంద‌రూ అంటూ ఉంటారు. ఇక‌, సొంత పార్టీ నేత‌లు కూడా సోము వ్యాఖ్య‌ల‌పై అప్పుడ‌ప్పుడు.. వ్యంగ్యాస్త్రా లు సంధిస్తూ ఉంటారు. దీనికి కార‌ణం.. ఆయ‌న త‌ల-తోక లేని కామెంట్లు చేయ‌డ‌మే. ``మా నాయ‌కుడు.. మాట్లాడితే.. ఒకింత ఆలోచించాల్సిందే. ఆయ‌న ఏం మాట్లాడినా.. అది ప్ల‌స్ అవ‌డం మాట అటుంచితే.. మైన‌స్ అవుతూ ఉంటుంది.`` అని బీజేపీ రాష్ట్ర నేత‌లు..గుస‌గుస‌లాడుతూ ఉంటారు.. ఇప్పుడు ఇలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి జ‌రిగింది. సోము వారి వ్యాఖ్య‌లు స‌ముద్ర తీరాలు దాటిపోయాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

సోము వీర్రాజు ఏమ‌న్నార‌నే విష‌యం చ‌ర్చించుకునే ముందు.. అస‌లు ఏపీలో బీజేపీ ప‌రిస్థితిని ఒక‌సారి చూద్దాం. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ.. టీడీపీ+జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని.. నాలుగు అసెంబ్లీ సీట్లు ద‌క్కించుకుని, ఒక ఎంపీ స్థానంలో విజ‌యం సాధించింది. 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి ఒంట‌రిగానే విజ‌యం సాధిస్తామ‌ని.. మోడీ ప్ర‌భంజ‌నం త‌మ‌కు ప్ల‌స్ అవుతుంద‌ని.. నాయ‌కులు ప్ర‌తిజ్ఞ‌లు చేసి మ‌రీ .. ఎన్నిక‌ల బ‌రిలో దిగారు. కానీ, ఆ నాలుగు కూడా ద‌క్క‌లేదు. ఇక‌, ఈ స‌మ‌యంలోనే టీడీపీ కూడా వైసీపీ సునామీ(అంద‌రూ ఇలానే అనుకుంటున్నారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు కూడాఇదే తేల్చారు. ఒక సారి అవ‌కాశం ఇవ్వ‌మ‌న్న జ‌గ‌న్ వైపు ప్ర‌జ‌లు నిలిచార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు) ముందు ఓడిపోయింది. కేవ‌లం 23 స్థానాల‌లో నే విజ‌యం ద‌క్కించుకుంది. మ‌రో మూడు ఎంపీ స్థానాలు గెలుచుకుంది.

కానీ, ఈ విష‌యంపై సోము వీర్రాజు వితండ వ్యాఖ్య‌లు చేశారు. తమతో పెట్టుకుంటే టీడీపీకి పట్టిన గతే వైసీపీకి కూడా పడుతుందని వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి చాలా ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. తమతో పెట్టుకున్నందువల్లే(అంటే.. హోదా కోసం.. చంద్ర‌బాబు కేంద్రంలోని బీజేపీతో అప్ప‌ట్లో ఫైట్ చేశారు క‌దా.. ఈ విష‌యాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ..) 2019 ఎన్నికల్లో టీడీపీ 23 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటుకు సీట్టకు పడిపోయిందని చెప్పేశారు. వాస్త‌వానికి టీడీపీ స‌హా ఏపీ జ‌నాలు.. జగన్మోహన్ రెడ్డి దెబ్బకే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కుదేలైపోయిందని అనుకుంటున్నారు.

అయితే.. ఇప్పుడు వీర్రాజు చెప్పింది నిజమైతే మరి బీజేపీ ఒక్క అసెంబ్లీ, ఎంపి సీటులో కూడా ఎందుకని గెలవలేదనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. టీడీపీని దెబ్బకొట్టేంత సీనే బీజేపీకి ఉంటే.. గ‌త ఎన్నిక‌ల్లో ఏం చేసింది. పోనీ.. ఇటీవ‌ల జ‌రిగిన తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో ఏం ఒర‌గ‌బెట్టింది? అనేది సోము వీర్రాజు చెప్పాలి. వాస్తవాలు ఇలాగుంటే అందరికీ తెలిసిన లాజిక్ కూడా మరచిపోయి వీర్రాజు ప్రకటనలు చేసేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. గ‌త మార్చిలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా బీజేపీ ఎక్క‌డా విజ‌యం ద‌క్కించుకోలేదు. ఒక్క మునిసిపాలిటీలోనూ క‌మ‌లం విక‌సించ‌లేదు. ఇంకో మాట చెప్పాలంటే.. అసలు పోటీ చేయటానికి అభ్యర్ధులే దొరక లేదు. ఇదీ వాస్త‌వం. కానీ.. సోము మాత్రం.. పొంతన లేని డైలాగుల‌తో మాట‌ల పోరు సాగిస్తున్నారు. ఇవి ఎవ‌రికి ఉప‌యోగ‌ప‌డ‌తాయో.. ఆయ‌న‌కే తెలియాలి.. అంటున్నారు ప‌రిశీల‌కులు.