Begin typing your search above and press return to search.

వరంగ‌ల్‌ కు మోనోరైల్‌...కేటీఆర్ కొత్త ప్రాజెక్ట్‌

By:  Tupaki Desk   |   19 Jan 2018 5:43 AM GMT
వరంగ‌ల్‌ కు మోనోరైల్‌...కేటీఆర్ కొత్త ప్రాజెక్ట్‌
X
తెలంగాణలో రాజ‌ధాని హైద‌రాబాద్ త‌ర్వాత అంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అభివృద్ధి చేస్తున్న ప్రాంతం వ‌రంగ‌ల్‌. ఇప్ప‌టికే పారిశ్రామిక కారిడార్ - ఐటీ రంగం విస్త‌ర‌ణ‌కు ప్ర‌య‌త్నిస్తున్న తెలంగాణ స‌ర్కారు మ‌రో కొత్త ప్ర‌త్యేక‌త‌ను అందించ‌నుంది. వ‌రంగ‌ల్‌ లో మోనోరైల్‌ ను సిద్ధం చేస్తున్న‌ది. ప్రపంచశ్రేణి నగరాల సరసన వరంగల్‌ ను నిలిపేందుకు తీసుకుంటున్న చర్యల్లో రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. అన్నీ అనుకూలిస్తే వరంగల్ మహానగరంలో సమీప భవిష్యత్‌ లో మోనోరైల్ పరుగులు పెట్టనుంది.

వరంగల్-హన్మకొండ-కాజీపేట పట్టణాల సమాహారంగా స్విట్జర్లాండ్‌ కు చెందిన ప్రపంచప్రఖ్యాత ఇంటమిన్ ట్రాన్స్‌ పోర్టేషన్ కంపెనీ మోనోరైల్ ప్రాజెక్టును నిర్మించేందుకు ముందుకొచ్చినట్టు స‌మాచారం. కాజీపేట నుంచి వరంగల్ వరకు 12 కిలోమీటర్లకు దాదాపు రూ.1200 కోట్లతో ఈ ప్రాజెక్టుకు రూపల్పన దశ దాదాపు పూర్తయింది. చైనా - రష్యా - ఇజ్రాయెల్ - జర్మనీ - వియత్నాం వంటి 30 దేశాల్లో విజయవంతంగా నడుపుతున్న మోనోరైల్ ప్రాజెక్టును.. వరంగల్‌ లో ఏర్పాటుకు ఇంటమిన్ ట్రాన్స్‌ పోర్టేషన్ కంపెనీ ముందుకొచ్చింది. బెంగళూర్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ స్పెక్ట్రమ్ సంస్థ - ఇంటమిన్ ట్రాన్స్‌ఫోర్టేషన్ బిజినెస్ అడ్వయిజర్ ఏఎన్‌ ఎన్ సామ్రాట్ తన ప్రతినిధి బృందంతో కలిసి మూడునెలల కిందట వరంగల్ మహానగరంలో పర్యటించి ప్రతిపాదనలు రూపొందించారు. అత్యాధునిక ఫ్యాబ్రికేటెడ్ సాంకేతిక విధానంలో సింగిల్‌ బీమ్‌ లో భూసేకరణ అవసరంలేకుండా మోనోరైల్ నడిపేందుకు అనువైన ట్రాక్ నిర్మించవచ్చని భావిస్తున్నారు.

వరంగల్ మహానగరంలో రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టడంతో.. రోడ్ డివైడర్ల స్థలంలోనే సింగిల్ పిల్లర్ వేసి మోనోరైల్‌ ను నడిపేందుకు అనువైన పరిస్థితులున్నాయని ఆ కంపెనీ భావించింది. ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీతో తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రయోజనాలు వచ్చేలా ప్రాజెక్టును రూపొందించనున్నట్టు తెలుస్తోంది. లాంఛనాలు పూర్తయ్యాక 10 నుంచి 12 నెలల వ్యవధిలో ప్రాజెక్టు సిద్ధంచేసే అవకాశాలున్నాయని గ్లోబల్ స్పెక్ట్రమ్ కన్సల్టెంట్ ప్రతినిధులు ప్రతిపాదనలు రూపొందించినట్టు సమాచారం. మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ పర్యటనలో భాగంగా వరంగల్‌ లో మోనోరైల్ ప్రాజెక్టుపై ఇంటమిన్ ట్రాన్స్‌ఫోర్టేషన్ కంపెనీతో చర్చించే అవకాశాలున్నాయని తెలిసింది. ఇక్కడ ఎంవోయూ కుదిరితే ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్ పడ్డట్టేనని తెలుస్తోంది.