Begin typing your search above and press return to search.

కలకలం: చనిపోయిన వ్యక్తి నుంచి 8మందికి మహమ్మారి

By:  Tupaki Desk   |   23 May 2020 7:50 AM GMT
కలకలం: చనిపోయిన వ్యక్తి నుంచి 8మందికి మహమ్మారి
X
ఓ ఫొటో గ్రాఫర్ పెళ్లిలో ఫొటోలు తీశాడు. అక్కడ మహమ్మారి వైరస్ బారిన పడ్డాడు. అనంతరం ఇంటివారికి.. పక్కింటి వారికి అంటించాడు. ఓ ఆస్పత్రిలో కంటి పరీక్ష చేసుకొని వారికి అంటించాడు. మేనకోడలు ఇంటికి వెళ్లి వారికి అంటించాడు. వైరస్ ముదిరి తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన ఆ వ్యక్తి ద్వారా ఏకంగా 8మందికి మహమ్మారి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వీరిందరికీ సదురు మృతుడి ద్వారా వైరస్ వ్యాపించినట్టు అధికారులు గుర్తించారు. ఇందులో ఆరుగురు మృతుడి రక్తసంబంధీకులు కాగా మరికొందరు ఇంటికి దగ్గర్లో నివసిస్తున్న వ్యక్తులు. ఇక ఈయన కలిసిన వారికి ఇంకా టెస్టులు చేయకపోవడంతో వైరస్ బాధితుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా జరిగింది తూర్పు గోదావరి జిల్లాలో..

పచ్చగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలో వారం రోజులుగా వరుసపెట్టి ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ లు నిర్ధారణ కావడంతో ఆయా ప్రాంతాల్లో కలకలం చెలరేగింది.శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 8 కేసులు గురువారం మృతి చెందిన వ్యక్తి ద్వారా వ్యాపించాయి.ఆరుగురిది తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లలమామిడాడ, ఇద్దరిదీ బిక్కవోలు.. సగం మంది 50 ఏళ్ల పైబడిన వారే కావడంతో ఆందోళన నెలకొంది. ఇక బొమ్మురులో క్వారంటైన్ లో ఉన్న ముగ్గురికి శుక్రవారం పాజిటివ్ గా తేలింది. ఇందులో ముగ్గురు 30 ఏళ్లలోపు యువకులే.. మూడు రోజుల కిందటే విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్ లో ఉన్నారు.మరో యువకుడిది రాజమండ్రి సీతంపేట.. వలస వెళ్లి వచ్చిన ఇతడికి పాజిటివ్ గా తేలింది.

ఇలా తూర్పు గోదావరి జిల్లాను కేసులు కుదేపిస్తున్నాయి. ఒక్క కేసు కూడా నమోదు కాని ప్రాంతాల్లో కొత్తగా ఇవి వెలుగులోకి వస్తుండడంతో వైద్యులు, అధికారులు తలపట్టుకుంటున్నారు.