Begin typing your search above and press return to search.

ఎనిమిది జిల్లాలకు ప్రాతినిధ్యమే లేదు

By:  Tupaki Desk   |   11 April 2022 5:57 AM GMT
ఎనిమిది జిల్లాలకు ప్రాతినిధ్యమే లేదు
X
జగన్మోహన్ రెడ్డి కొత్త మంత్రివర్గంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి. 25 మంది మంత్రులతో కొత్త మంత్రివర్గం సోమవారం ఉదయం 11.31 గంటలకు ప్రమాణస్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే. అనేక కాంబినేషన్లతో పెద్ద కసరత్తు చేసిన తర్వాత జగన్ తన క్యాబినెట్ ను సిద్ధం చేశారు. ఇపుడు చేసిన కసరత్తులో ఎనిమిది జిల్లాలకు అసలు ప్రాతినిధ్యమే దక్కలేదంటే ఆశ్చర్యంగానే ఉంది.

మంత్రివర్గంలో అత్యధికంగా చిత్తూరు జిల్లా నుండి ముగ్గురికి ప్రాతినిధ్యం లభించింది. శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల నుండి ఇద్దరికి అవకాశం వచ్చింది.

నిజానికి 26 జిల్లాల నుండి 25 మందిని మంత్రివర్గంలోకి తీసుకుందామనే జగన్ అనుకున్నారు. అయితే సీనియారిటి, సమర్ధత, సామాజికవర్గాల సమీకరణలు లాంటి అనేక కాంబినేషన్ల ఆధారంగా కసరత్తు చేసిన తర్వాత ఎనిమిది జిల్లాలకు అవకాశమే దొరకలేదు.

అల్లూరి సీతారామరాజు, విశాఖ, ఏలూరు, ఎన్టీయార్, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. దీనికి ప్రాధాన కారణం రెడ్డి, ఎస్టీ సామాజికవర్గాల ఎంఎల్ఏలు ఎక్కువుండటమే, సొంత సామాజిక వర్గం ఎంఎల్ఏలను జగన్ ఎక్కువమంది తీసుకోరన్న విషయం తెలిసిందే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో రెడ్డి ఎంఎల్ఏలకు అవకాశం ఇవ్వలేదు.

మొదటి క్యాబినెట్లో కూడా రెడ్లు నలుగురే ఉన్నారు. ఇపుడు కూడా అంతే ఉన్నారు. రాయలసీమలోని ఎనిమిది జిల్లాల నుండి ఎన్నికైన వారిలో అత్యధికులు రెడ్లే. అందుకనే వారికి కోతపడింది. ఇక విశాఖ జిల్లాలో ఉన్నది ఆరు నియోజకవర్గాలు.

ఇందులో విశాఖ నగరం నుండి నలుగురు ఎంఎల్ఏలు టీడీపీ వారే. మిగిలిన ఇద్దరు వైసీపీ ఎంఎల్ఏలు అవంతి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి. అవంతిని డ్రాప్ చేశారు, సొంత సామాజికవర్గం కాబట్టి నాగిరెడ్డికి అవకాశం రాలేదు. ఇలాంటి కారణాలతోనే మొత్తం ఎనిమిది జిల్లాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మరి కొత్త మంత్రివర్గం మిగిలిన రెండేళ్ళు ఎలా పనిచేస్తుందో చూడాలి.