Begin typing your search above and press return to search.

కరోనా పాజిటివ్ కేసుల వేళ.. కరీంనగర్ లో మహా జల్లెడ

By:  Tupaki Desk   |   19 March 2020 4:15 AM GMT
కరోనా పాజిటివ్ కేసుల వేళ.. కరీంనగర్ లో మహా జల్లెడ
X
జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా.. ఎవరో చేసిన తప్పులకు.. పొరపాట్లకు మరెవరూ మూల్యం చెల్లించే పరిస్థితి కరోనా వైరస్ విషయంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ కారణంతోనే.. కరోనా విషయంలో మహా అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ ప్రభుత్వం మొదట్నించి ప్రచారం చేస్తోంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో ఆదివారం నుంచి సినిమాహాళ్లను మూసివేయటం.. బార్లు.. పబ్ లు.. జిమ్ లతో పాటు.. స్కూళ్లు.. కాలేజీలు.. వివిధ సమావేశ మందిరాలు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. జనాలు ఎక్కువగా జమ అయ్యే ప్రదేశాల్ని మూసి వేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

అయినప్పటికీ.. కొందరు కక్కుర్తితో దొంగచాటుగా నిర్వహిస్తుంటే.. వారిపై దాడులు చేసి మూసివేయటం తెలిసిందే. ఇంత చేసినా.. ఊహించని విధంగా ఇండోనేషియా నుంచి రామగుండం మీదుగా కరీంనగర్ కు చేరుకున్న పదిమంది.. వారికి ఢిల్లీలో జత కలిసిన ఉత్తరప్రదేశ్ కు చెందిన మరో వ్యక్తి కారణంగా కరీంనగర్ లో ఇప్పుడు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ టీంలోని ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ అని తేలటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాత్రికి రాత్రే కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కావటంతో తెలంగాణ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరీంనగర్జిల్లా కలెక్టర్.. పోలీస్ కమిషనర్.. మంత్రి గంగుల కమలాకర్ రంగంలోకి దిగారు. ఇండోనేషియా టీం ఎక్కడెక్కడ తిరిగింది? ఎవరెవరిని కలిసింది? అన్నది ఆరా తీశారు. వారు బస చేసిన మసీదును పూర్తిస్థాయిలో శుభ్రం చేయించారు. మసీదు ఉన్న వీధిని పూర్తిగా దిగ్బంధం చేసి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న బజార్ ను పూర్తిగా మూసివేశారు. ఎవరిని అనుమతించటం లేదు.

ఇండోనేషికి చెందిన వారు కలెక్టరేట్ ప్రాంతంలో గడిచిన 48 గంటల్లో తిరిగిన నేపథ్యంలో.. ఆ ప్రాంతానికి మూడు కిలోమీటర్ల మేర ఉన్న ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం వంద వైద్యం టీంలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ లో నిత్యవసర దుకాణాలు మినహా మిగిలిన షాపులు.. వ్యాపార సంస్థలన్ని మూసివేస్తే మంచిదని కలెక్టర్.. మంత్రి గంగుల కోరుతున్నారు. ఎవరికి వారు ఇంటి వద్దే ఉండాలని.. మరీ అవసరమైతే తప్పించి ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని సూచనలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఇండోనేషియాకు చెందిన వారు కరీంనగర్ లో తిరిగిన ప్రాంతలన్నింటిని మహా జల్లెడ పట్టి.. కరోనా లక్షణాలు ఉన్న వారెవరు? అన్నది లెక్క తేల్చే పనిలో పడ్డారు.