Begin typing your search above and press return to search.

షిండేకి ముందున్నది ముళ్ళబాటేనా ?

By:  Tupaki Desk   |   9 Aug 2022 7:30 AM GMT
షిండేకి ముందున్నది ముళ్ళబాటేనా ?
X
చాలారోజుల తర్వాత మహారాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటుకు ముహూర్తం ఫిక్సయ్యింది. ముఖ్యమంత్రిగా ఏక్ నాధ్ షిండే, ఉపముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు తీసుకున్న 40 రోజుల తర్వాత మంగళవారం మంత్రివర్గం ఏర్పాటుకాబోతోంది. అంటే 40 రోజులపాటు మంత్రివర్గం లేకుండానే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మాత్రమే ప్రభుత్వాన్ని నడిపారన్నమాట. ఈ పరిస్ధితి ఎందుకు వచ్చిందంటే మంత్రులుగా ఎవరిని తీసుకోవాలనే విషయంలో పెద్ద సమస్య రాబట్టే.

ఇక్కడ విషయం ఏమిటంటే శివసేన చీలికవర్గంలోని 40 మంది ఎంఎల్ఏలు+బీజేపీ 106 మంది ఎంఎల్ఏలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని ఒప్పందం జరిగింది.

శివసేనలో తిరుగుబాటు లేవదీసిన షిండే బీజేపీ మద్దతు కారణంగానే సీఎం అవ్వగలిగారు. తిరుగుబాటు సక్సెస్ కావటానికి శివసేనలో తనతో కలిసివచ్చే ఎంఎల్ఏలకు అప్పట్లో షిండే మంత్రిపదవులను ఎరగా వేశారు. ప్రతిఒక్కళ్ళకు మంత్రిపదవులను ఎరగావేయటంతో 40 మంది ఆశతో షిండేవెంట నడిచారు.

థాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన తర్వాత షిండే మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుంటే సమస్య రాకపోను. షిండే ప్రభుత్వంలో బీజేపీ కూడా చేరాలని అనుకోవటంతోనే సమస్య మొదలైపోయింది. మహారాష్ట్రలోని అసెంబ్లీలోని సీట్ల సంఖ్య ఆధారంగా 43 మందికి మాత్రమే మంత్రిపదవులు ఇవ్వాలి. ఇప్పటి లెక్కప్రకారం బీజేపీకే ఎక్కువ పదవులు వదులుకోవాల్సొస్తోంది. దీంతో ముందుగా హామీ ఇచ్చినట్లు అందరికీ మంత్రిపదవులను షిండే ఇవ్వలేకపోతున్నారు. దీంతో మంత్రిపదవులు రానివారు షిండేపై మండిపోయే ప్రమాదముంది.

అంటే ఏదోరోజు కొందరు ఎంఎల్ఏలు షిండేపైన కూడా తిరుగుబాటు లేవదీసి మళ్ళీ థాక్రే వైపు వెళ్ళిపోయే అవకాశముంది. ఈ కారణంగానే మంత్రివర్గం ఏర్పాటు ముహూర్తంతోనే షిండేకి డౌన్ ఫాల్ స్టార్టయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అంటే షిండేకి ముందున్నదంతా ముళ్ళబాటే అని స్పష్టంగా అర్ధమైపోతోంది. తిరుగుబాటు లేవదీసి థాక్రే ప్రభుత్వాన్ని కూల్చేసినంత తేలిక్కాదు తిరుగుబాటు ఎంఎల్ఏలను మ్యానేజ్ చేయటమని షిండేకి ఇప్పుడు అనుభవమవుతోంది. మరి చివరకు మంత్రివర్గం ఏర్పాటు తర్వాత పరిస్ధితులను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.