Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఐడియాను ఫాలో అవుతున్న ఏక్ నాథ్.. ఫడ్నవీస్

By:  Tupaki Desk   |   17 Aug 2022 4:40 AM GMT
కేసీఆర్ ఐడియాను ఫాలో అవుతున్న ఏక్ నాథ్.. ఫడ్నవీస్
X
తెలివైనోళ్ల లక్షణం అంటే ఇలా ఉండాలి. ఏదైనా అంశాన్ని తమకంటే ఎవరైనా బాగా ఆలోచిస్తే.. వెంటనే దాన్ని ఫాలో అయిపోతుంటారు కొందరు. అలా ఫాలో అయితే ఎవరేం అనుకుంటారన్నది అస్సలు ఆలోచించరు. అలాంటి తెలివైనోళ్ల ఆలోచన ఎలా ఉంటుందంటే..

వచ్చే సక్సెస్ మీదనే ఉంటుంది. తాజాగా అలాంటి తీరులోనే ఆలోచిస్తున్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే.. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. పంద్రాగస్టు వజ్రోత్సవాల నేపథ్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించటం.. అది కాస్తా సూపర్ హిట్ కావటం తెలిసిందే.

మంగళవారం ఉదయం 11.30 గంటల వేళలో తెలంగాణ మొత్తంగా స్తంభింపచేజేలా చేయటంతో పాటు.. ట్రాఫిక్ తో పాటు మెట్రో రైలును సైతం ఆ సమయంలో నిలిపివేయటం.. ఒక నిమిషం పాటు జాతీయ గీతాలాపన చేయటం తెలిసిందే.

దీనికి విశేష స్పందన వచ్చిన తీరును చూసిన మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఐడియాను తమ రాష్ట్రంలో ఫాలో కావటానికి సిద్దమయ్యారు. హైదరాబాద్ మహానగరంతో పాటు యావత్ తెలంగాణలోనూ ఇదే తీరును ప్రదర్శించారు.

సరిగ్గా ఇదే విధానాన్ని మహారాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఉదయం 11 గంటల వేళలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేపడుతూ..

దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేశారు. ఓవైపు తమ పార్టీకి అన్నీతానై అన్నట్లుగా నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సామూహిక జాతీయ గీతాలాపన ఐడియాను కాపీ కొట్టే విషయంలో 'మహా' ముఖ్యమంత్రి అస్సలు మొహమాటపడలేదనే చెప్పాలి.