Begin typing your search above and press return to search.

ఉపవాసం చేసింది.. ప్రాణాలు పోగొట్టుకుంది

By:  Tupaki Desk   |   6 Sept 2019 12:13 PM IST
ఉపవాసం చేసింది.. ప్రాణాలు పోగొట్టుకుంది
X
భక్తి ఉండాలి కానీ.. అది హద్దులు దాటకూడదు. దేవుడి మీద నమ్మకం మంచిదే కానీ.. దానికో పరిమితి ఉంటుందన్నది మరవకూడదు. తాజాగా అతి విశ్వాసంతో చేసిన ఉపవాసదీక్షతో ఒక యువతి ప్రాణాలు కోల్పోయిన ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. వివిధ మతాల్లో ఉపవాసం గురించి ఒక్కోలా చెబుతుంటారు. జైన సంప్రదాయంలో ఏడు రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తే మంచిదన్న నమ్మకం ఉంది.

పలువురు ఆ దీక్షను చేస్తుంటారు. మత విశ్వాసాల్ని బలంగా నమ్మే గుజరాత్ కు చెందిన ఏక్తా అశుభాయ్ అనే జైన్ మహిళ.. తాజాగా ఏడు రోజుల ఉపవాస దీక్షను షురూ చేశారు. గుజరాత్ లోని కచ్ లోని పుట్టింటికి ఆమె వచ్చారు. ఆగస్టు 27న ఆమె ఏడు రోజుల పాటు సాగే ఉపవాస దీక్షను మొదలెట్టారు.

ఐదు రోజుల దీక్ష అనంతరం ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు రోజుకు ఒకసారైనా ఏదో ఒక ఆహారం తినాలని సలహా ఇచ్చారు. అయితే.. అందుకు తమ మత విశ్వాసం ఒప్పుకోదంటూ నిరాకరించారు. సెప్టెంబరు 3న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించటంతో ఆమెకు గ్లూకోజ్ ఎక్కించారు.

పలువురి ఒత్తిడి మేరకు ఆమె ద్రవాహారం తీసుకుంటానని.. అది కూడా జైన విశ్వాసాలకు తగినట్లుగా బాయిల్డ్ వాటర్ మాత్రమే తాగేందుకు అంగీకరించారు. అదే రోజు రాత్రి ఆమె గుండెపోటుతో మరణించారు. విశ్వాసం మంచిదే అయితే.. అదేదీ ప్రాణాలు పోకుండా ఆపలేదన్న నిజాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మత విశ్వాసం మూఢత్వంగా మారకూడదు. అదే జరిగితే మొదటికే మోసం ఖాయం.