Begin typing your search above and press return to search.

సీఈసీతో రాజీవ్ శ‌ర్మ భేటీ కార‌ణం ఇదేనా?

By:  Tupaki Desk   |   24 Aug 2018 4:27 AM GMT
సీఈసీతో రాజీవ్ శ‌ర్మ భేటీ కార‌ణం ఇదేనా?
X
గ‌డువుకు ముందే ఎన్నిక‌ల్ని నిర్వ‌హించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు క‌స‌ర‌త్తును మ‌రింత ముమ్మ‌రం చేస్తున్న సంకేతాలు తాజా ప‌రిణామాలు మ‌రింతగా స్ప‌ష్టం చేస్తున్నాయి. గురువారం వ‌రుస‌గా చోటు చేసుకున్న ప‌రిణామాలు చూస్తే.. ముంద‌స్తుకు వెళ్లే ఆలోచ‌న‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. అయితే.. తెలంగాణ రాష్ట్ర సీఎం కోరుకున్న‌ట్లుగా ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉందా? లేదా? అన్న విష‌యాన్ని ప‌క్కాగా చెక్ చేసుకోవ‌టానికి వీలుగా ప్ర‌య‌త్నాలు షురూ అయ్యాయి.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు రాజీవ్ శ‌ర్మ ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ అశోక్ ల‌వాసాతో భేటీ కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకీ భేటీ అన్న దానికి ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ముంద‌స్తుకు వెళ్లాల‌న్న ఉద్దేశంతో గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వాన్ని తొంద‌ర‌ప‌డి ర‌ద్దు చేశారు. అయితే.. ఆయ‌న కోరుకున్న‌ట్లు కాకుండా కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లుగా ఎన్నిక‌లు నిర్వ‌హించింది.

ఇలాంటి అనుభ‌వాల్ని గుర్తు పెట్టుకున్న కేసీఆర్‌.. అలాంటివేమీ చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా ముంద‌స్తు క‌స‌ర‌త్తును ప‌క‌డ్బందీగా చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు.. రిటైర్డ్ సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిని ఢిల్లీని పంప‌టం ద్వారా.. తాము ముంద‌స్తుకు వెళ్లాల‌న్న ఆలోచ‌న‌లో ఉంటే.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎలా రియాక్ట్ అవుతుంది? ఎన్నిక‌ల్ని తాము అనుకున్న‌ట్లే నిర్వ‌హించే వీలుందా? సాంకేతిక ఇబ్బందులు ఏమైనా ఎదుర‌వుతాయా? నిబంధ‌న‌ల ప్ర‌కారం తెలంగాణ‌లో ఎన్నిక‌ల్ని చేప‌ట్టేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ముందున్న ఇబ్బందులు ఏమిటి? అన్న విష‌యాల్ని తెలుసుకోవ‌టానికి వీలుగా రాజీవ్ శ‌ర్మ‌ను ఢిల్లీకి పంపిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇక్క‌డ మ‌రో ఆస‌క్తిక‌ర అంశం ఏమంటే.. రాజీవ్ శ‌ర్మ 1982 బ్యాచ్ కాగా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ అశోక్ ల‌వాసా 1980 బ్యాచ్ కు చెందిన వారు. అంటే.. త‌న కంటే రెండేళ్ల సీనియ‌ర్ అయిన ల‌వాసాతో గతంలో రాజీవ్ శ‌ర్మ‌కు అనుబంధం ఉంది. ఆయ‌న కేంద్ర స‌ర్వీసుల్లో ఉన్న‌ప్పుడు ల‌వాసాతో మంచి అనుబంధం ఉంది. ఈ నేప‌థ్యంలో.. టెక్నిక‌ల్ అంశాలు తెలంగాణ ముఖ్య‌మంత్రి అనుకుంటున్న ముంద‌స్తుకు ఎలాంటి అడ్డంకి ఉండ‌కుండా ఉండేందుకు వీలుగానే తాజా భేటీ జ‌రిగిందంటున్నారు.