Begin typing your search above and press return to search.

బ‌తుక‌మ్మచీర‌ల పంపిణీకి 'కోడ్' బ్రేక్!

By:  Tupaki Desk   |   29 Sep 2018 5:59 PM GMT
బ‌తుక‌మ్మచీర‌ల పంపిణీకి కోడ్ బ్రేక్!
X
గ‌త ఏడాది ద‌స‌రాకు ముందు తెలంగాణ‌లో బ‌తుక‌మ్మ పండుగ సంద‌ర్భంగా చీర‌ల పంపిణీ కార్య‌క్రమం పై చాలామంది మ‌హిళ‌లు పెద‌వి విరిచిన సంగ‌తి తెలిసిందే. నాసిర‌కం చీర‌ల కోసం గంట‌ల త‌ర‌బ‌డి క్యూలో నిలుచోవాల్సి వ‌చ్చింద‌ని కొందరు వాపోయారు. ఏది ఏమైనా...తాజాగా ఈ ఏడాది మ‌రోసారి బ‌తుక‌మ్మ పండుగ‌కు ముందు చీర‌ల పంపిణీ చేప‌ట్టాల‌ని టీ స‌ర్కార్ నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే దాదాపు 280కోట్ల ఖ‌ర్చుతో 95ల‌క్ష‌ల మందికి చీర‌ల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. అయితే, తాజాగా తెలంగాణ‌లో అమ‌ల్లోకి వ‌చ్చిన `కోడ్` టీఆర్ ఎస్ ఆశ‌ల‌కు గండికొట్టింది. ఈ కోడ్ ప్ర‌కారం ప్ర‌భుత్వానికి ల‌బ్ధి చేకూర్చే ప్రకటనలు,పథకాలు, కానుకలు ఇవ్వకూడదు. అందుకే, అక్టోబర్ 12న జ‌ర‌గ‌నున్న చీర‌ల‌ పంపిణీ కార్య‌క్ర‌మానికి బ్రేక్ ప‌డిన‌ట్లేన‌ని తెలుస్తోంది. దీంతోపాటు రైతుబంధు ప‌థ‌కం కూడా అమ‌ల‌య్యే వీలు లేద‌ని తెలుస్తోంది.

తాజాగా అమల్లోకి వ‌చ్చిన ఎన్నిక‌ల కోడ్ వ‌ల్ల చీరల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌క‌పోవ‌చ్చ‌ని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో, ఇప్ప‌టికే ప‌లు గ్రామాల‌కు చేరుకున్న‌ చీర‌లు ఏం చేయాల‌ని వారు ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ని తెలుస్తోంది. కానీ, ఈసీ అనుమ‌తితో చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. కోడ్ క‌న్నా ముందే ఈ కార్య‌క్ర‌మం రూపొందించినందున ఈసీ అధికారులు అడ్డుచెప్పరనే టీఆర్ ఎస్ నేత‌లు భావిస్తున్నార‌ట‌. మ‌రోవైపు, 57 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.4వేలు చొప్పున ఇచ్చేందుకు రూపొందించిన రైతు బంధు ప‌థ‌కం కూడా అమ‌ల‌య్యేలా లేద‌ని తెలుస్తోంది. అయితే, చీరల పంపిణీ - రైతుబంధు చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మాల‌కు అడ్డుప‌డ‌కూడదని కాంగ్రెస్ భావిస్తోందట‌. వాటిని అడ్డుకుంటే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నార‌ట‌. అయితే, ఆ కార్య‌క్ర‌మాల అమలులో కేసీఆర్ ఫోటో ఉండ‌కుండా చూడాలని వారు కోరుతున్నార‌ట‌. అంతేకాకుండా, ప్రభుత్వ అధికారుల చేతులమీదుగానే ఆ పంపిణీ జరగాలని చెప్పార‌ట‌. మ‌రి, ఆ రెండు కార్య‌క్ర‌మాలపై ఈసీ ఎలా స్పందిస్తుందోన‌ని స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఏర్ప‌డింది.