Begin typing your search above and press return to search.

ఇప్పుడు కేఏ పాల్ కింక‌ర్త‌వ్యం ఏమిటి?

By:  Tupaki Desk   |   14 Sep 2022 11:30 AM GMT
ఇప్పుడు కేఏ పాల్ కింక‌ర్త‌వ్యం ఏమిటి?
X
సీరియ‌స్ పాలిటిక్స్‌లో ఆట‌లో అర‌టి పండు, క‌మెడియ‌న్‌గా ప్ర‌జా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను అంద‌రూ భావిస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు. ఆయ‌న చేసే వ్యాఖ్య‌లు, ఇచ్చే హామీలు న‌మ్మ‌శ‌క్యం కాదు కాబ‌ట్టి ఆయ‌న మాట‌ల‌ను అంతా లైట్ తీసుకుంటూ ఉంటారు. కాబోయే తెలంగాణ ముఖ్య‌మంత్రిని తానేన‌ని, జ‌గ‌న్ త‌న పార్టీలో చేరితే ప్ర‌ధానిని చేస్తాన‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న పార్టీలో చేరితే ఏపీ ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని కేఏ పాల్ త‌ర‌చూ చెబుతూ ఉంటార‌నే విష‌యం తెలిసిందే.

అయినా కేఏ పాల్ త‌న‌పై వ‌చ్చే మీమ్స్‌కు, సెటైర్ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోరు. య‌థాలాపంగా తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పే తీరతారు. దేశంలో వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.. కేఏ పాల్. అంతేకాకుండా హైద‌రాబాద్‌లో అక్టోబ‌ర్ 2న జింఖాన గ్రౌండులో ప్ర‌పంచ శాంతి స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నాన‌ని తెలిపారు. ఈ స‌భ‌ల‌కు ఏకంగా 28 దేశాల ప్ర‌ధాన‌మంత్రులు వ‌స్తున్నార‌ని వెల్ల‌డించారు.

అలాంటి కేఏ పాల్‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీ) దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. క్రియాశీల‌కంగా లేని 537 పార్టీల‌ను ఎన్నిక‌ల సంఘం నుంచి జాబితా నుంచి తొల‌గించింది. ఆ పార్టీల గుర్తింపును, ఎన్నిక‌ల గుర్తుల‌ను సైతం రద్దు చేసింది. ఎన్నిక‌ల సంఘం త‌మ జాబితా నుంచి తొల‌గించిన రాజ‌కీయ పార్టీల జాబితాలో ప్ర‌జాశాంతి పార్టీ కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌తో ఏపీ, తెలంగాణ‌ల్లో 20 రాజ‌కీయ పార్టీలు గుర్తింపును, వాటి పార్టీ గుర్తింపును కోల్పోయాయి. ఇందులో కేఏ పాల్ కు చెందిన ప్ర‌జా శాంతి పార్టీ ఉండ‌టం ఆయ‌న‌కు పెద్ద షాకేన‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో కేఏ పాల్ ఏం చేస్తార‌నేదానిపై ఉత్కంఠ నెల‌కొంది. త‌న పార్టీని ర‌ద్దు చేసి ప్ర‌వ‌క్త‌గానే మిగిలిపోతారా? లేక పార్టీ గుర్తింపు కోసం ఫైట్ చేస్తారా అనేద తేలాల్సి ఉంది.

అయితే ప్ర‌జాశాంతి పార్టీకి గుర్తింపు రద్దు అయ్యింద‌న్న విష‌యం తెలిసిన నెటిజ‌న్లు మాత్రం ఫ‌న్నీగా కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త‌దిత‌రులు కేఏ పాల్‌కు ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్‌మెంట్ ఇస్తారు కాబ‌ట్టి వారిపై ఒత్తిడి తెచ్చి మ‌ళ్లీ ప్ర‌జాశాంతి పార్టీకి గుర్తింపు పొందాల‌ని సూచిస్తున్నారు.

మ‌రికొంత‌మంది అయితే.. ఈ విష‌యంలో ఆయ‌న‌కు 28 దేశాల ప్ర‌ధాన‌మంత్రులు స‌న్నిహితులు కాబ‌ట్టి వారిని తీసుకొచ్చి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ముందు ధ‌ర్నా చేయాల‌ని సూచిస్తున్నారు.

ఇంకొంత‌మంది అయితే.. అయ్యో ఇన్నాళ్లు రాజ‌కీయాల్లో కామెడీ లేద‌ని బాధ‌ప‌డేవాళ్లం. కేఏ పాల్ వ‌చ్చాక రాజ‌కీయాలు మంచి హాస్యాన్ని పంచుతున్నాయి. ప్ర‌జాశాంతి పార్టీ గుర్తింపు ర‌ద్దు చేసి మాకు హాస్యాన్ని దూరం చేశారు క‌దా అని వాపోతున్నారు.

కేఏ పాల్ తాను ముఖ్య‌మంత్రి అయ్యాక ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డులు తెచ్చి తెలంగాణ‌ను అభివృద్ధి చేస్తానంటే చూసి ఓర్వ‌లేక ఆయ‌న పార్టీని కేసీఆర్, జ‌గ‌న్ త‌దిత‌రులు ర‌ద్దు చేయించార‌ని ఫ‌న్నీగా సెటైర్లు వేస్తున్నారు. ఆయన పార్టీని ర‌ద్దు చేయించి ప్ర‌పంచ ప్రసిద్ధ కంపెనీల‌ను తెలంగాణ‌కు రాకుండా చేశారు క‌ద‌రా అని సెటైరిక‌ల్ గా స్పందిస్తున్నారు.

కాగా త‌న పార్టీ గుర్తింపు ర‌ద్దుపై ఇంకా కేఏ పాల్ స్పందించ‌లేదు. ఈ వ్య‌వ‌హారంపై ఆయ‌న ఏం చేస్తార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.