Begin typing your search above and press return to search.

హుజూర్ నగర్ ఎన్నికలు.. ఈసీ షాకిచ్చింది..

By:  Tupaki Desk   |   25 Aug 2019 11:07 AM GMT
హుజూర్ నగర్ ఎన్నికలు.. ఈసీ షాకిచ్చింది..
X
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆరు నెలల్లోపే ఆ అసెంబ్లీ స్థానానికి తిరిగి ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల కమిషన్ విధి. కానీ ఈ నియమాన్ని తాజాగా ఈసీ పక్కనపెట్టి షాకిచ్చింది. గత డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో పోటీచేసి గెలిచారు. ఆ వెంటనే మేలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా కూడా గెలిచాడు. మేలోనే ఎంపీ పదవిలో ఉండి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

దీన్ని బట్టి ఈ నవంబర్ లోపే అక్కడ తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈసీ మాత్రం దేశంలో ఇలానే రాజీనామా చేసిన స్థానాలన్నింటిలో ఎన్నికలు నిర్వహించేందుకు తాజాగా ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అనూహ్యంగా అందులో హుజూర్ నగర్ లేకపోవడం చూసి టీఆర్ ఎస్ - కాంగ్రెస్ లు షాక్ అయ్యాయి.

కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా నాలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరించింది. యూపీలోని హమీర్ పూర్ - చత్తీస్ ఘడ్ లోని దంతేవాడ - కేరళలోని పాల - త్రిపురలోని భాదర్ ఘాట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 23న ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే అందరూ ఊహించిన తెలంగాణలోని హుజూర్ నగర్ కు మాత్రం ఇవ్వకపోవడంతో తెలంగాణ రాజకీయ నాయకులు షాక్ అయ్యారు.

హుజూర్ నగర్ ను దక్కించుకోవాలని టీఆర్ ఎస్.. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాయి. హుజూర్ నగర్ లో కేసీఆర్ కూతురు కవితను నిలబెట్టాలని టీఆర్ ఎస్ భావిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఈ స్థానంపై దృష్టిసారించలేదు. తాజాగా ఈసీ కూడా ఇక్కడ ఎన్నికలకు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.