Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ కు ఎన్నిక‌ల సంఘం పిలుపు

By:  Tupaki Desk   |   10 Jan 2016 9:32 AM GMT
ప‌వ‌న్‌ కు ఎన్నిక‌ల సంఘం పిలుపు
X
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అంద‌రి దృష్టి ప‌వ‌ర్ స్టార్-జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పై ప‌డింది. త‌మ‌కోసం ప్ర‌చారానికి రావాల‌ని టీడీపీ-బీజేపీ కూట‌మి ఆహ్వానిస్తుండ‌గా...త‌మ పాటికి త‌మ ప్ర‌చారం చేసుకోకుండా నాయ‌కుల కోసం ఏర్పాటుచేసిన స‌మావేశంలోనూ సీఎం కేసీఆర్ కూతురు, ఎంపీ క‌విత ప‌వ‌న్‌ పై విమ‌ర్శ‌ల చేశారు. సీమాంధ్ర ఓట్లు పొందేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ను బీజేపీ-టీడీపీ నేత‌లు ప్ర‌చారానికి పిలుస్తున్నారంటూ కామెంట్లు చేశారు.

ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం టీడీపీ-బీజేపీ నేత‌ల ఆహ్వానం సంగ‌తి ప‌క్క‌న పెడితే ఇపుడు ప‌వ‌న్‌ ను రాష్ర్ట ఎన్నిక‌ల సంఘం పిలిచింది. తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీగా జ‌న‌సేన గుర్తింపు పొందిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్-షెడ్యూల్‌ విడుద‌ల అయిన నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘం త‌దుప‌రి అడుగులు వేసింది. హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో పోటీలో ఉన్న పార్టీల వారీగా వివ‌రాలు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన రాజ‌కీయ పార్టీగా గుర్తింపు పొందిన నేప‌థ్యంలో ఇంకా శాశ్వ‌త గుర్తు పొంద‌లేదు.

ఈ నేప‌థ్యంలో తాజాగా త‌మ వ‌ద్ద ఉన్న ఫ్రీ సింబ‌ల్స్‌ లో నుంచి గుర్తును ఎంచుకోవాల‌ని ప్ర‌తిపాదించారు. జ‌న‌సేన ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకుంటే మొత్తం 81 గుర్తుల‌లో నుంచి ఏదైనా గుర్తును ఉంచుకోవాల‌ని ఎన్నిక‌ల సంఘం కోరింది. జ‌న‌సేన త‌ర‌హాలోనే మ‌రో 71 పార్టీలు రాజ‌కీయ గుర్తింపు పొంది గుర్తులు స్వీక‌రించ‌కుండా ఉన్నాయి. వాటికి కూడా ఇదే త‌ర‌హా ప్ర‌తిపాద‌న పెట్టారు.