Begin typing your search above and press return to search.

ఏపీలో ఎన్నికల కోడ్.. ఈసీ క్లారిటీ

By:  Tupaki Desk   |   22 Feb 2019 5:28 AM GMT
ఏపీలో ఎన్నికల కోడ్.. ఈసీ క్లారిటీ
X
ఏపీలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు వేళయ్యింది.. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలకు నగరా మోగనుంది. దీంతో ఈ ఫిబ్రవరి నుంచే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ తో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని.. అభివృద్ధి కార్యక్రమాలు సహా అన్ని పనులు ఆగిపోతాయని వార్తలు వచ్చాయి. చంద్రబాబు సర్కారు కూడా హడావుడిగా కేబినెట్ మీటింగ్ లు పెట్టి అన్నింటిని ఆమోదిస్తోంది. అయితే ఈ విషయంపై తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది.

‘ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల కోడ్ వర్తించదు. కేవలం గ్రాడ్యుయేట్, టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రమే కోడ్ వర్తిస్తుంది’ అని ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గోపాలక్రిష్ణ ద్వివేది క్లారిటీ ఇచ్చారు. అది కూడా పాక్షిక కోడ్ మాత్రమేనని.. ఆ నియోజకవర్గాల పరిధిలో మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీ రాష్ట్రం మొత్తం కోడ్ వర్తించదని తెలిపారు.

దీన్ని బట్టి ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏపీలో ఎన్నికల కోడ్ పూర్తిగా రాదని అర్థమైంది. కేవలం అసెంబ్లీ, జనరల్ ఎన్నికల నోటిఫికేషన్ తోనే ఏపీలో కోడ్ అమల్లోకి రానుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మార్చి మొదటి వారంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సమాచారం. అప్పటి వరకు ఏపీలో ఎన్నికల కోడ్ ఉండదన్న మాట..