Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం కౌంట‌ర్‌!

By:  Tupaki Desk   |   19 Sep 2018 5:22 AM GMT
కాంగ్రెస్ కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం కౌంట‌ర్‌!
X
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇటీవ‌ల కాలంలో త‌మ‌పై చేస్తున్న విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల‌పై సీఈసీ గుర్రుగా ఉన్న వైనం తాజా ఉదంతంతో బ‌య‌ట‌కు వ‌చ్చింది. స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌లిగిన ఎన్నిక‌ల సంఘం ప‌నిలో కాంగ్రెస్ పార్టీ జోక్యం త‌గ‌ద‌న్న అభిప్రాయాన్ని తాజాగా సీఈసీ వెల్ల‌డించింది.

మ‌రికొద్ది నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రగ‌నున్న రాజ‌స్థాన్.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో పార‌ద‌ర్శ‌క‌త‌.. జ‌వాబుదారీత‌నంతో వ్య‌వ‌హ‌రించేలా ఆదేశించాలంటూ కాంగ్రెస్ పార్టీ నేత క‌మ‌ల్ నాథ్ సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై సీఈసీ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

కాంగ్రెస్ పిటిష‌న్ ను రిజెక్ట్ చేయాలంటూ తాజాగా ఈసీ 101 పేజీల కౌంట‌ర్ ను దాఖ‌లు చేసింది. కాంగ్రెస్ తీరు త‌మ సంస్థ‌ల ప‌నితీరులో జోక్యం చేసుకునేదిగా ఉంద‌ని.. ఆ పార్టీ చెప్పిన‌ట్లుగా ఎన్నిక‌ల్ని నిర్వ‌హించ‌టం సాధ్యం కాద‌ని స్ప‌ష్టం చేసింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 60 ల‌క్ష‌ల న‌కిలీ ఓట‌ర్లు ఉన్నార‌ని.. వారిని తొల‌గించాలంటూ కాంగ్రెస్ నేత‌ల ఆరోప‌ణ‌ల్ని కొట్టి పారేసింది.

అదే స‌మ‌యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో వీవీ ప్యాట్ ల ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాల‌ని కాంగ్రెస్ కోరింది. క‌మ‌ల్ నాథ్ వేసిన పిటిష‌న్ పై మ‌రో కాంగ్రెస్ నేత‌.. ప్ర‌ముఖ న్యాయ‌వాది అభిషేక్ మ‌ను సింఘ్వి వాదన‌లు వినిపించారు. ఇదిలా ఉంటే.. రాజ‌స్థాన్‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో న‌కిలీ ఓట‌ర్లు లేరంటూ కేంద్ర ఎన్నిక‌ల సంగం తాజాగా దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ లో పేర్కొంది. కీల‌క‌మైన ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చిన వేళ‌.. సీఈసీపై కాంగ్రెస్ అసంతృప్తి వ్య‌క్తం చేయ‌టంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.