Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ 1300 కిలోల బంగారం ఎక్కడిది..?

By:  Tupaki Desk   |   18 April 2019 5:23 AM GMT
ఎన్నికల వేళ 1300 కిలోల బంగారం ఎక్కడిది..?
X
తాజాగా నిర్వ‌హించిన సోదాల్లో 1381 కేజీల బంగారం వ్య‌వ‌హారం తీవ్ర క‌ల‌క‌లం రేప‌టం తెలిసిందే. యాక్టివ్ గా ఉన్న మీడియాకు సోష‌ల్ మీడియా తోడు కావ‌టంతో.. వేలాది కేజీల బంగారానికి సంబంధించి పుకార్లు షికార్లు చేశాయి. ఇదిగో తోక అంటే.. అదిగో పులి అన్న‌ట్లుగా మారిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో.. ఇంత భారీగా బంగారం ఆక‌స్మిక త‌నిఖీల్లో దొర‌క‌టంతో ఏదో కుట్ర ఉంద‌న్న అనుమానాలు వ్యాపించాయి.

అయితే.. ఈ బంగారం ఎక్క‌డి నుంచి ఎక్క‌డ‌కు వెళుతోంది? దీనికి సంబంధించి డాక్యుమెంట్లు ఉన్నాయా? అన్న లోతుల్లోకి వెళితే.. ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగుచూశాయి. త‌మిళ‌నాడులోని తిరువ‌ళ్లూరు జిల్లా వేపంప‌ట్టులో 1381 కేజీల బంగారాన్ని ఎన్నిక‌ల సంఘం అధికారులు ప‌ట్టుకున్నారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా నిర్వ‌హించిన ఆక‌స్మిక త‌నిఖీల్లో భాగంగా తనిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఇంత భారీగా బంగారాన్ని ప‌ట్టుకొని.. అందుకు బాధ్యులైన న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు.

సోదాల్లో ల‌భించిన బంగారానికి ప‌క్కా లెక్క ఉందంటూ పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ ముందుకు వ‌చ్చింది. ఈ బ్యాంకులో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి సంబంధించిన బంగారం ఉంద‌ని.. దాని మెచ్యూరిటీ ముగియ‌టంతో ఈ బంగారాన్ని త‌ర‌లిస్తున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న ఈ ఉదంతంలో త‌మ‌కు సంబంధం లేద‌ని టీటీడీ స్ప‌ష్టం చేసింది.

బంగారాన్ని తిరుమ‌ల‌లో అప్ప‌గించాల్సిన బాధ్య‌త పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ దేన‌ని టీడీపీ క్లియ‌ర్ గా చెప్పేసింది. అధికారులు ప‌ట్టుకున్న బంగారం స్విట్జ‌ర్లాండ్ నుంచి కొనుగోలు చేసిన‌ట్లుగా ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఈ బంగారు క‌డ్డీల‌ను టీటీడీకి అప్ప‌జెప్పేందుకు బ్యాంకు అధికారులు వాహ‌నంలో పంపుతున్నారు. దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి.

శ్రీ‌వారికి సంబంధించిన బంగారాన్ని పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. దాని గ‌డువు 20 రోజుల క్రితం పూర్తైంది. దీన్ని రిలీజ్ చేసి.. టీటీడీకి అప్ప‌గించాలి. ఇదిలా ఉండ‌గా.. బ్యాంకు అధికారులు బంగారాన్ని త‌ర‌లిస్తున్న విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘానికి లేఖ పంపిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. టీటీడీ ట్రెజ‌రీకి త‌ర‌లిస్తున్న విష‌యాన్ని త‌మ దృష్టికి తేలేద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం స్ప‌ష్టం చేసింది. త‌మ ద‌గ్గ‌రున్న ఆధారాల్ని తిర‌వ‌ళ్లూరు క‌లెక్ట‌ర్ కు అప్ప‌జెప్పి.. తాము టీటీడీకి అప్ప‌జెబుతామ‌ని పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఇంత క్లారిటీతో చెబుతున్నా.. ప‌లువురికి మాత్రం ఏదో ఒక మూల మాత్రం సందేహం కొడుతూనే ఉందని చెప్ప‌క త‌ప్ప‌దు.