Begin typing your search above and press return to search.

కేసీఆర్ షెడ్యూల్ కే ఈసీ ప్లాన్ చేస్తుందా?

By:  Tupaki Desk   |   24 Sep 2018 5:50 AM GMT
కేసీఆర్ షెడ్యూల్ కే ఈసీ ప్లాన్ చేస్తుందా?
X
విప‌క్షాల విష‌యంలో వెనుకా ముందు చూసుకోకుండా విరుచుకుప‌డే ధోర‌ణి అధికార‌ప‌క్షానికి మామూలే. కానీ.. ఎన్నిక‌ల‌కు వెళ్లే స‌మ‌యంలో మాత్రం ఎంత పెద్ద అధికార‌ప‌క్ష‌మైనా స‌రే.. ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుందే త‌ప్పించి తొంద‌ర‌పాటుతో లేనిపోని తిప్ప‌ల్ని తెచ్చుకోవ‌టం ఉండ‌దు.

కానీ.. ఇందుకు భిన్నంగా టీఆర్ ఎస్ అధినేత‌.. తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌వ‌హ‌రించిన తీరు ఈ మ‌ధ్య‌న సంచ‌ల‌నం సృష్టించింది. ముంద‌స్తుకు వెళ్లే క్ర‌మంలో.. అసెంబ్లీని ర‌ద్దు చేసిన కాసేప‌టికే ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో.. అసెంబ్లీ ఎన్నిక‌ల్ని ఈసీ ఎప్పుడు నిర్వ‌హిస్తుంద‌న్న విష‌యంపై కేసీఆర్ త‌న‌దైన శైలిలో చెప్ప‌టం.. మాట‌ల మ‌ధ్య‌లో కేంద్ర సీఈసీతో తాను ఇప్ప‌టికే మాట్లాడిన‌ట్లు చెప్ప‌టం సంచ‌ల‌నం సృష్టించింది.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం చెప్పిన‌ట్లుగా.. ఏ ఏ తేదీల్లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ షురూ అవుతుందో చెప్ప‌టంతో పాటు.. రిజ‌ల్ట్ ఎప్పుడు వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంద‌న్న విష‌యాన్ని చెప్ప‌టం షాకింగ్ గా మారింది. కేసీఆర్‌ మాట‌ల్ని వామ‌ప‌క్ష నేత‌లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకెళ్ల‌టం.. ఆ సంద‌ర్భంగా కేసీఆర్ తీరును త‌ప్పు ప‌డుతూ వ్యాఖ్య‌లు చేయ‌టం క‌నిపించింది.

కేసీఆర్ మాట‌ల నేప‌థ్యంలో.. ఆయ‌న చెప్పిన‌ట్లుగా ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించ‌కూడ‌ద‌న్న వాద‌న ఒక వ‌ర్గం బ‌లంగా వినిపించింది. అయితే.. కేసీఆర్ చెప్పిన‌ట్లు కాకుండా షెడ్యూల్ లో మార్పులు చేస్తే.. చాలా ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని.. మ‌రిన్ని చిక్కుముడులు ప‌డే అవ‌కాశం ఉందంటున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో.. తెలంగాణ‌లో ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప‌నుల విష‌యంపై ఈసీ సంతృప్తిక‌రంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్రకారం.. మీడియా స‌మావేశంలో కేసీఆర్ చెప్పిన రీతిలోనే..తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు నిర్వ‌హించే వీలుంద‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే.. ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయో.. ఎప్పుడు పూర్తి అవుతాయో చెప్పి మ‌రీ ఎన్నిక‌ల‌కు వెళ్లిన ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ నిలిచిపోతార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.