Begin typing your search above and press return to search.

మోడీకి మ‌రో క్లీన్ చిట్ ఇచ్చిన ఈసీ!

By:  Tupaki Desk   |   3 May 2019 8:30 AM GMT
మోడీకి మ‌రో క్లీన్ చిట్ ఇచ్చిన ఈసీ!
X
ప్ర‌ధాన‌మంత్రి అంటే ఎలా ఉండాలంటే అన్న భావ‌న‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఊహించ‌నిరీతిలో వ్యాఖ్య‌లు చేస్తున్న మోడీ తీరుపై మీడియాలోనూ.. సోష‌ల్ మీడియాలోనూ భారీ ఎత్తున చ‌ర్చ జ‌ర‌గుతోంది. ప‌శ్చిమ‌బెంగాల్ లో రాజ‌కీయం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. మ‌మ‌తా బెన‌ర్జీ రాజ‌కీయంగా ఎంత క‌ర‌కుగా ఉంటార‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. ఒక దేశ ప్ర‌ధాని త‌న ఎన్నిక‌ల ర్యాలీ సంద‌ర్భంగా.. 40 మంది బెంగాల్ అధికార‌ప‌క్ష ఎమ్మెల్యేలు త‌న‌తో ట‌చ్ లో ఉన్నార‌ని.. ఫ‌లితాలు వెలువ‌డిన రోజు ఏం జ‌రుగుతుందో చూడాలంటూ ఆయ‌న చేసిన చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారాన్ని రేపాయి.

అంతేనా.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆర్మీ ప్ర‌స్తావ‌న‌.. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ ఇష్యూతో పాటు.. అభినంద‌న్ ప్ర‌స్తావ‌న తెచ్చిన మోడీ మాట‌లు చాలానే హాట్ టాపిక్ గా మారాయి. ఎంత ఎన్నిక‌ల వేళ అయితే మాత్రం.. ప్ర‌ధాని హోదాలో ఉన్న పెద్ద మ‌నిషి నోటి నుంచి.. వ‌చ్చే మాట‌లు ఇవా? అన్న విస్మ‌యాన్ని ప‌లువురు వ్య‌క్తంచేసిన ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. మోడీ చేసిన వ్యాఖ్య‌ల్లో ఇండియ‌న్ ఆర్మీ.. న్యూక్లియ‌ర్ వెప‌న్స్ సంబంధించిన అంశాల మీద ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పైకాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ వ్యాఖ్య‌లు ఎన్నిక‌ల కోడ్ కు విరుద్ధంగా ఉన్న‌ట్లు పేర్కొంది. ఈ వ్యాఖ్య‌ల్ని ప‌రిశీలించి.. నిర్ణ‌యం తీసుకోవాలని కోరింది.

కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన అంశాల మీద దృష్టి సారించిన ఈసీ.. తాజాగా ప్ర‌ధాని మోడీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న ప్ర‌స్తావించిన అంశాల్లోనూ.. చేసిన వ్యాఖ్య‌ల్లోనూ కోడ్ ఉల్లంఘ‌న అంశాలు ఏమీ లేవ‌ని పేర్కొంది. రాజ‌స్థాన్ లోని బ‌ర్మార్ లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాకిస్థాన్ పై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా భార‌త సైన్యం.. న్యూక్లియ‌ర్ శ‌క్తి మీద ఆయ‌న అనూహ్య వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్థాన్.. త‌న వ‌ద్ద న్యూక్లియ‌ర్ బాంబు ఉంద‌ని బెదిరిస్తోంద‌ని.. అయితే భార‌త్ ఆ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌ద‌న్నారు. అంతేకాదు.. పాక్ కానీ న్యూక్లియ‌ర్ బాంబును ప్ర‌యోగిస్తే.. మ‌న ద‌గ్గ‌ర ఉన్న న్యూక్లియ‌ర్ బాంబును దీపావ‌ళి వేళ పేల్చేందుకు దాచుకుంటామా? అంటూ వ్యంగ్య వ్యాఖ్య చేయ‌టం ద్వారా సంచ‌ల‌నం సృష్టించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై విచార‌ణ జ‌రిపిన ఈసీ.. మోడీ వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన ప‌ది పేజీల స్క్రిప్ట్ ను ప‌రిశీలించిన అనంత‌రం ఆయ‌న‌కు క్లీన్ చిట్ ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. మోడీకి ఈసీ క్లీన్ చిట్ ఇవ్వ‌టం ఇది ముచ్చ‌ట‌గా మూడోసారి!