Begin typing your search above and press return to search.

ఈసీ...వ్య‌భిచారిణితో స‌మానం

By:  Tupaki Desk   |   31 May 2018 4:11 AM GMT
ఈసీ...వ్య‌భిచారిణితో స‌మానం
X
బీజేపీ కూట‌మిలో భాగ‌స్వామిగా ఉండి...అనంత‌రం ఆ పొత్తుకు టాటా చెప్పిన మ‌రాఠాల పార్టీ శివ‌సేన అవ‌కాశం వ‌స్తే..బీజేపీని ఇర‌కాటంలో ప‌డేసేందుకు ఏ మాత్రం మొహ‌మాటం ప్ర‌ద‌ర్శించ‌ని సంగ‌తి తెలిసిందే. సంద‌ర్భం ఏదైనా బీజేపీపై విరుచుకుప‌డే శివ‌సేన తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తాజాగా మహారాష్ట్రలో జరిగిన భండారా-గోండియా - పాల్‌ గఢ్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించడం - వీవీపీఏటీలు పనిచేయకపోవడంపై శివసేన తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. ఈ ప‌రిణామం శివసేన అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్ పేజీలో సంచ‌ల‌న వ్యాసం రాసింది. ఎన్నికల కమిషన్(ఈసీ) పై శివసేన తీవ్రవ్యాఖ్యలు చేసింది. పోలింగ్ సిబ్బంది - ఎన్నికల సంఘం - ప్రజాస్వామ్యం .. అధికారంలో ఉన్నవాళ్ల కు ఉంపుడుగత్తెలుగా మారుతున్నాయంటూ పరుషపదజాలంతో దూషించింది.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఈవీఎంలు - ఓటు నమోదుపత్రం(వీవీపీఏటీ)లను ట్యాంపరింగ్ చేశారంటూ శివ‌సేన ధ్వజమెత్తింది. `` ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యదేశంగా భారతదేశం పేరు ఇంకా ఎంతోకాలం నిలబడదు. ఈవీఎంలను బీజేపీ దుర్వినియోగం చేసి తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటోంది. ఈవీఎంలు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయి. అధికారంలో ఉన్న వ్యక్తులు తమ నిరంకుశ ఆలోచనావిధానంతో ప్రజాస్వామ్యాన్ని తమ ఉంపుడుగత్తెగా మల్చుకొంటున్నారు`` అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఎండ తీవ్రత వల్లే ఈవీఎంలు పనిచేయలేదన్న ఈసీ వర్గాల వ్యాఖ్యలపై శివసేన స్పందిస్తూ.. ఎండ తీవ్రత కారణంగా ప్రధాని ప్రయాణిస్తున్న విమానం ఇంజిన్లు పనిచేయలేదని మనం ఎప్పుడైనా విన్నామా? అని శివసేన మండిపడింది.