Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: పంజాబ్ పోలింగ్ డేట్ ను మార్చిన ఈసీ

By:  Tupaki Desk   |   17 Jan 2022 10:30 AM GMT
బ్రేకింగ్: పంజాబ్ పోలింగ్ డేట్ ను మార్చిన ఈసీ
X
అనూహ్యంగా స్పందించింది కేంద్ర ఎన్నికల సంఘం. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ చన్నీ వినతికి యుద్ధ ప్రాతిపదికన రియాక్టు కావటమే కాదు.. ఆయన చేసిన సూచనకు తగ్గట్లు.. పోలింగ్ డేట్ ను మార్చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. తొలుత పేర్కొన్నట్లుగా పంజాబ్ లో పోలింగ్ ను ఫిబ్రవరి 14న కాకుండా.. ఫిబ్రవరి 20న నిర్వహించేందుకు వీలుగా ఆరు రోజులు వాయిదా వేసింది. ఎందుకిలా? పంజాబ్ సీఎం వినతి ఏమిటి? ఆయనేం అడిగారు? ఈసీ ఏం చెప్పింది? అన్న విషయాల్ని చూస్తే..

కేంద్ర ఎన్నికల సంఘం పంజాబ్ ఎన్నికల పోలింగ్ తేదీని ఫిబ్రవరి 14 డిసైడ్ చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ డేట్ సమయంలోనే యూపీలోని బెనారస్ లో గురు రవిదాస్ జయంతి ఉత్సవాలు జరుగుతుంటాయని.. వీటికి పంజాబ్ నుంచి లక్షలాది మంది బెనారస్ కు తరలి వెళతారని పేర్కొన్నారు. ఈ కారణంతో పోలింగ్ ను ఫిబ్రవరి 14 కాకుండా మరో తేదీకి మార్చాలని కోరారు.

కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న తేదీకి పోలింగ్ ను నిర్వహిస్తే.. లక్షలాది మంది ఓటు వేసే అవకాశాన్ని కోల్పోతారని.. అందుకే.. పోలింగ్ తేదీని వారం పాటు వాయిదా వేయాలని కోరారు. ముఖ్యమంత్రి లేవనెత్తిన పాయింట్ లో అర్థం ఉండటంతో ఈసీ సానుకూలంగా స్పందించింది. ముఖ్యమంత్రి చెప్పినట్లే ఫిబ్రవరి 14న కాకుండా ఫిబ్రవరి20న పోలింగ్ ను మారుస్తూ ప్రకటన విడుదల చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది.
దీని ప్రకారం..

జనవరి 25 - ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఫిబ్రవరి 01 - నామినేషన్లకు తుది గడువు
ఫిబ్రవరి 02 - నామినేషన్ల పరిశీలనకు తుది గడువు
ఫిబ్రవరి 04 - నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు
ఫిబ్రవరి 20 - ఎన్నికల పోలింగ్
మార్చి 10 - ఓట్ల లెక్కింపు.. ఎన్నికల ఫలితాల విడుదల.