Begin typing your search above and press return to search.

కేబినెట్ భేటీ.. ఈసీ షరతులను ఖాతరు చేయరా?

By:  Tupaki Desk   |   14 May 2019 7:35 AM GMT
కేబినెట్ భేటీ.. ఈసీ షరతులను ఖాతరు చేయరా?
X
ఎట్టకేలకూ ఏపీ కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ముందుగా వీరావేశంతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ కేబినెట్ భేటీకి అనుమతిని ఇవ్వడం లేదంటూ.. చంద్రబాబు నాయుడు తన పార్టీ వారి మధ్యన కూర్చుని ఫైర్ అయ్యారు. ఈసీ మీద - ప్రధాని మీద - వైఎస్సార్సీపీ మీద ఈ అంశం బాబు ఫైర్ అయినట్టుగా తెలుగుదేశం వారు మీడియాకు లీకులు ఇచ్చారు.

తనకు రూల్స్ వర్తించవు అంటూ చంద్రబాబు నాయుడు ముందుగా కేబినెట్ భేటీకి తేదీని కూడా ప్రకటించారు. 'అధికారులు ఎలా రారో చూస్తా..' అంటూ బాబు హెచ్చరికను లీకుగా ఇచ్చారు. అయితే చివరకు ఏమో అదే అధికారుల ద్వారా ఈసీ అనుమతిని సంపాదించుకున్నారు చంద్రబాబు నాయుడు. కేబినెట్ భేటీ విషయంలో అధికారుల నుంచి ఎన్నికల సంఘానికి విన్నపం వెళ్లడం - అది అటు నుంచి సీఈసీ వద్దకు వెళ్లడం.. చివరకు అనుమతి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రకటించుకున్నట్టుగా తన ఇష్టం మేరకు కాకుండా - సీఈసీ అనుమతి మేరకు కేబినెట్ భేటీ జరుగుతోంది.

అయితే అలా అనుమతిని ఇవ్వడంలో కొన్ని షరతులను పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ముందస్తుగా కేబినెట్ భేటీ అజెండాను అంతా వివరించాలని - ఏ అంశాల మీద చర్చించాలని అనుకుంటున్నారో తమకు చెప్పే చర్చించాలని ఈసీ స్పష్టం చేసింది. ఆ మేరకు కేబినెట్ భేటీకి అనుమతి సంపాదించడానికి కరువు - తుఫాను వంటి అంశాలను జాబితాగా పంపించారు. అయితే చంద్రబాబు నాయుడు కేబినెట్ భేటీ అసలు ఉద్దేశం అది కాదు..అనే వారూ ఉన్నారు! ఫలితాలు మరో పది రోజుల్లోనే వెల్లడి కానున్న నేపథ్యంలో తన అనుచవర్గానికి అయాచిత లబ్ధిని కలిగించడానికే చంద్రబాబు నాయుడు ఇలా కేబినెట్ భేటీని నిర్వహిస్తూ ఉన్నారని ఒక ప్రచారం సాగుతూ ఉంది. అయితే చంద్రబాబుకు అంత అవకాశం ఉండదని.. కేబినెట్ భేటీకి అనుమతిని ఇచ్చినట్టుగానే ఇచ్చి - ఈసీ ఆయన చేతులు కట్టేసిందని వార్తలు వస్తున్నాయి.

కేబినెట్ భేటీకి అనుమతిని ఇస్తూనే..షరతులు వర్తిస్తాయని ఈసీ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఆ షరతుల్లో ప్రధానమైనవి.. 'బకాయిలు చెల్లించడం - అంచనాలు పెంచడం కుదరదు..' అనేది. ఈ భేటీలో చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయడం - ఏదైనా ప్రాజెక్టు విషయంలో అంచనాలను పెంచడం..వంటి పనులు చేయడానికి అవకాశం ఉండదని ఈసీ నియామవళిలో స్పష్టంగా ఉందట.

కేబినెట్ భేటీలో కరువు - తుఫాను వంటి సబ్జెక్టుల గురించి మాట్లాడుకోవచ్చు.. అంతే కానీ, వాటితో సంబంధం లేని ఆర్థిక అంశాల గురించి మాట్లాడటానికి వీల్లేదని స్పష్టం అవుతోంది. అలాగే కేబినెట్ భేటీ అనంతరం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటానికి వీల్లేదని కూడా ఈసీ స్పష్టంగా పేర్కొందట.

మరి ఈ షరతుల మేరకే చంద్రబాబు నాయుడి కేబినెట్ భేటీ జరుగుతుందా? లేక చంద్రబాబు నాయుడు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ భేటీ అనంతరం ప్రెస్ మీట్ పెట్టకపోయినా.. భేటీలో పాల్గొన్న వారు మొత్తం అంశాలను క్లియర్ గా వివరించి చెప్పడం అయితే ఖాయం. కాబట్టి అసలు సంగతి అంతా మరి కాసేపట్లో తేలిపోవచ్చు!