Begin typing your search above and press return to search.

ముందు కాదు.. నాలుగుతో పాటే ముంద‌స్తు?

By:  Tupaki Desk   |   11 Sep 2018 5:23 AM GMT
ముందు కాదు.. నాలుగుతో పాటే ముంద‌స్తు?
X
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు ఎప్పుడు జ‌ర‌గ‌నున్నాయి? ముంద‌స్తు విష‌యంలో కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆస‌క్తిక‌ర నిర్ణ‌యం తీసుకుంటుందా? ముందుగా అనుకున్న‌ట్లు నాలుగు రాష్ట్రాల‌తో ఎన్నిక‌లు జ‌రుగుతాయా? లేక నాలుగు రాష్ట్రాల కంటే ముందే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్ని నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల‌తో క‌లిపి నిర్వ‌హించే వీలుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. రాజ‌స్థాన్‌.. మిజోరాం.. ఛ‌త్తీస్ గ‌ఢ్ ల‌తో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నిక‌లు జ‌ర‌ప‌టానికి ఎక్కువ అవ‌కాశాలు ఉన్న‌ట్లుగా ఈసీ వ‌ర్గాలు చెప్ప‌టం గ‌మ‌నార్హం.

ఖాళీ అయిన అన్ని స్థానాల‌కు ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించిన పక్షంలో వ‌స‌తులు.. మాన‌వ వ‌న‌రులు.. ఏర్పాట్లు చేయ‌టం సులువుగా ఉంటుంద‌ని భావిస్తున్నారు. రాష్ట్రాల‌కు వేర్వేరుగా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే భారం అధికం కావ‌టంతో పాటు విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం వ‌స్తుంద‌న్న మాట వినిపిస్తోంది.

ఈ మ‌ధ్య‌న వినిపించిన‌ట్లుగా నాలుగు రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్నినిర్వ‌హిస్తే.. దాని ఫ‌లితం మిగిలిన రాష్ట్రాల ఎన్నిక‌ల మీద ఎంతో కొంత ప‌డుతుంద‌న్న‌వాద‌న వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో.. నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల అనంత‌రం తెలంగాణ‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించిన ప‌క్షంలో.. నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు తెలంగాణ ఎన్నిక‌ల మీద ప‌డే వీలుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో వివాదాల‌కు దూరంగా ఉండ‌టంతో పాటు.. అంద‌రికి ఆమోద‌యోగ్యంగా ఉండేలా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీకి జ‌రిగే ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో ఈసీ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఒక‌వేళ‌.. అదే జ‌రిగితే తుది ఫ‌లితాలు సార్వ‌త్రిక ఎన్నిక‌ల మీద ప్ర‌భావం చూపించ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.