Begin typing your search above and press return to search.

ఎన్నిక‌లు ముందు.. రిజ‌ల్ట్ వారితో క‌లిసి?

By:  Tupaki Desk   |   25 Sep 2018 9:53 AM GMT
ఎన్నిక‌లు ముందు.. రిజ‌ల్ట్ వారితో క‌లిసి?
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై తెలీని సందిగ్థ‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన డేట్స్ విష‌యంలో ప‌లు వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే పోలింగ్ డేట్ల మీద సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల చ‌ర్చ న‌డుస్తోంది. ఇదిలా ఉంటే.. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

అంద‌రూ అంచ‌నా వేసిన‌ట్లే ఎన్నిక‌ల షెడ్యూల్‌ను అక్టోబ‌రు (వ‌చ్చే నెల‌) 10 లేదంటే 12 తేదీల్లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉందంటున్నారు. అక్టోబ‌రు నెలాఖ‌రు లోపు నామినేష‌న్ ప్ర‌క్రియను పూర్తి చేయాల‌ని.. న‌వంబ‌రు 15-20 మ‌ధ్య‌న పోలింగ్ నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

అయితే.. షెడ్యూల్ ప్ర‌కారం జ‌ర‌గాల్సిన నాలుగు రాష్ట్రాల (మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. మిజోరం.. రాజ‌స్థాన్‌) అసెంబ్లీ ఎన్నిక‌లు పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల్ని ఒకేసారి విడుద‌ల చేయాల‌న్న ఆలోచ‌న‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆలోచిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

అదే జ‌రిగితే.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముందే మొద‌లై.. పోలింగ్ పూర్తి అయినా.. తుది ఫ‌లితం బ‌య‌ట‌కు రావ‌టానికి మాత్రం కాస్త ఆల‌స్య‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు. ముందుగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు నిర్వ‌హించి.. ఫలితాలు వెల్ల‌డైతే.. దాని ప్ర‌భావం ప‌క్క‌నున్న రాష్ట్రాల మీద ప‌డే అవ‌కాశం ఉంద‌న్న వాద‌న వినిపిస్తున్న వేళ‌లో.. అలాంటిదేమీ లేకుండా ఉండేలా.. ముందు ఎన్నిక‌లు నిర్వ‌హించినా.. ఫ‌లితాల్ని మాత్రం అంద‌రితో పాటు క‌లిసి వెల్ల‌డిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండ‌దంటున్నారు.

ఇక‌.. తెలంగాణ‌లోని 119 అసెంబ్లీ స్థానాల్లోనూ ఎన్నిక‌ల్ని ఒకేసారి నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. మ‌రి..తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ వాద‌న‌లో నిజం ఎంత‌న్న‌ది కాల‌మే డిసైడ్ చేయాలి.