Begin typing your search above and press return to search.

జేసీకి బొమ్మ ప‌డింది!..చ‌ర్య‌ల‌కు ఈసీ రెడీ!

By:  Tupaki Desk   |   2 May 2019 5:07 PM GMT
జేసీకి బొమ్మ ప‌డింది!..చ‌ర్య‌ల‌కు ఈసీ రెడీ!
X
మ‌న‌సులో ఏముందో ఏమాత్రం దాచుకోకుండా న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్య‌లు చేసే టీడీపీ సీనియ‌ర్ నేత‌ - అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డికి నిజంగానే గ‌ట్టి షాక్ త‌గిలింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న‌యుల‌కు ఎంట్రీ ఇప్పించేసి దాదాపుగా రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్న త‌రుణంలో జేసీకి ఈ దెబ్బ ఏ మేర‌కు న‌ష్టం చేస్తుందో తెలియ‌దు గానీ... మొత్తంగా ఆయ‌న‌పై గ‌ట్టి చ‌ర్య‌ల‌కే ఈసీ రంగం సిద్ధం చేసేసింది. అయినా జేసీ చేసిన త‌ప్పేమిట‌న్న విష‌యంలోకి వ‌స్తే... త‌న సీట్లో నుంచి త‌న కుమారుడిని త‌మ్ముడి సీట్ లో నుంచి అత‌డి కుమారుడిని బ‌రిలోకి దించేసిన జేసీ... ఎన్నిక‌ల సంద‌ర్భంగా కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల్సి వ‌చ్చింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అది కూడా ఎక్క‌డో త‌న ఇంటివ‌ద్దో - త‌న సొంత జిల్లాలోనే జేసీ ఈ వ్యాఖ్య‌లు చేయ‌లేదు. సాక్షాత్తు ఏపీ సీఎం అధికారిక నివాసం వ‌ద్ద ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఓటుకు రెండు వేల నోటు ఇవ్వ‌క త‌ప్ప‌లేద‌ని - కొంద‌రైతే ఓటుక రూ.3 వేలు కూడా అడిగార‌ని త‌న‌దైన శైలి ఆవేద‌న వ్య‌క్తం చేసిన జేసీ.. త‌న వార‌సులు ఎంట్రీ ఇస్తున్న ఎన్నిక‌ల్లో బాగానే డ‌బ్బు ఖ‌ర్చు చేశామ‌న్న కోణంలో ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా జ‌రగాల్సిన ఎన్నిక‌ల‌ను డ‌బ్బు మ‌యం చేసేసిన‌ట్లుగా ఏమాత్రం మొహ‌మాటం లేకుండా వ్యాఖ్యలు చేసిన జేసీపై వైరి వ‌ర్గాలే కాకుండా సొంత పార్టీ నేత‌లు కూడా విస్మ‌యం వ్య‌క్తం చేశారు.

అయితే వామ‌ప‌క్షాల నేత‌లు మాత్రం కేవ‌లం విస్మ‌యం వ్య‌క్తం చేయ‌డంతోనే స‌రిపెట్టుకోకుండా ఏకంగా జేసీ ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించార‌ని, ఆయ‌న‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసేశారు. ఈ ఫిర్యాదుపై ప‌ది రోజులుగా సైలెంట్ గానే ఉండిపోయిన ఈసీ... ఇప్పుడు క‌త్తి తీసింది. కోట్లు ఖ‌ర్చు చేశామంటూ జేసీ చేసిన వ్యాఖ్య‌లు కోడ్ ఉల్లంఘ‌న కింద‌కే వ‌స్తాయ‌ని తేల్చేసింది. అంతేకాకుండా జేసీపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్ ఈ వ్య‌వ‌హారంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జేసీపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాలని, నిబంధ‌న‌ల మేర‌కు చ‌ర్య‌లు తీసుకుని స‌ద‌రు స‌మాచారాన్ని త‌న‌కు చేర‌వేయాల‌ని కింది స్థాయి అదికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. రాజ‌కీయాల్లో నుంచి దాదాపుగా త‌ప్పుకున్న జేసీపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారు? ఆ చ‌ర్య‌ల ఫ‌లితంగా జేసీకి వ‌చ్చే ఇబ్బంది ఏమ‌ట‌న్న‌ది ఇప్పుడు తేలాల్సి ఉంది. మొత్తంగా జేసీకి బొమ్మ ప‌డిపోయింద‌న్న మాట‌.