Begin typing your search above and press return to search.

సోమిరెడ్డికి ఊర‌ట ఇచ్చేలా ఈసీ నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   3 May 2019 8:42 AM GMT
సోమిరెడ్డికి ఊర‌ట ఇచ్చేలా ఈసీ నిర్ణ‌యం
X
ఒక ఉద్యోగి రిటైర్మెంట్ డేట్ రోజుల్లోకి వ‌చ్చేసిందనుకుందాం. ఆయ‌న చేస్తున్న పోస్టులో కొన‌సాగాలంటూ కంపెనీ ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌నుకుందాం. చివ‌రి రోజుల్లో ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి ఎలా ఉంటుంది. అది ప్ర‌భుత్వ ఉద్యోగ‌మా? ప్రైవేటు ఉద్యోగ‌మా? అన్న‌ది ప‌క్క‌న పెడితే.. ఉద్యోగం ఏదైనా.. రిటైర్ అయ్యే స‌మ‌యం రోజుల్లోకి వ‌చ్చేసిన‌ప్పుడు ఏ ఉద్యోగి అయినా ఏం చేస్తారు?

అప్ప‌టివ‌ర‌కూ త‌న‌కున్న ప‌రిధిని త‌న‌కు తాను త‌గ్గించుకొని.. వీలైనంత వ‌ర‌కూ కీల‌క నిర్ణ‌యాలు తీసుకోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. పెద్ద నిర్ణ‌యాల్ని వ‌దిలేస్తారు. ఇది ఎక్క‌డైనా.. ఎప్పుడైనా జ‌రిగేది. ఉద్యోగం విష‌యాన్ని ప‌క్క‌న పెడితే..ప్ర‌భుత్వ పాల‌న విష‌యంలోనూ ఇలాంటి ప‌రిస్థితి. ప్ర‌స్తుతం ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసాయి. దాంతో పాటు.. అసెంబ్లీఎన్నిక‌లు కూడా ముగిశాయి. ఫ‌లితం ఈవీఎంల‌లో ఉంది. వాటిని తెరిచేందుకు మ‌రో 20 రోజుల స‌మ‌యం ఉంది.

ఇలాంటివేళ‌.. అధికారంలో ఉన్న ప్ర‌భుత్వానికి విశేష‌మైన అధికారాలు.. పూర్తిస్థాయి అధికారాలు ఉండ‌వ‌న్న‌ది కామ‌న్. ఆ మాట‌కు వ‌స్తే..పూర్తికాలం అధికారం ఉన్న ప్ర‌భుత్వాలు సైతం.. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న‌ప్పుడు ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే పాల‌న అంత జోరుగా సాగ‌దు. ఈ విష‌యం కొత్త‌దేం కాదు. కానీ.. అదేం చిత్ర‌మో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కానీ.. ఆయ‌న మంత్రి వ‌ర్గంలోని కొంద‌రు నేత‌లు తెగ హైరానా ప‌డిపోతున్నారు.

ఎన్నిక‌లు ముగిసి.. ఫ‌లితాలు వ‌చ్చే సంధి ద‌శ‌లో అధికారుల్ని రివ్యూ స‌మావేశాల‌కు రావాల‌ని కోర‌టం.. వారిని ఉరుకులు ప‌రుగులు పెటించేలా నిర్ణ‌యం తీసుకోవ‌టం ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారింది. దీనికి తోడు.. ఏపీ ప్ర‌భుత్వానికి.. సీఎస్ కు మ‌ధ్య స‌రైన ట‌ర్మ్స్ లేక‌పోవటం మ‌రో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి నెల‌కొంది.

దీంతో స‌మీక్ష‌కు రావాల‌ని వ్య‌వ‌సాయ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి కోరుతుంటే.. గ‌డిచిన రెండు రోజులుగా అధికారులు ఎవ‌రూ రివ్యూకు రాని ప‌రిస్థితి. దీంతో.. ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి.. ఎన్నిక‌ల సంఘం మీద పోరాటం చేస్తాన‌న్న ఆల్టిమేటం ఇచ్చేశారు. ఇదే స‌మ‌యంలో మ‌రోసారి.. స‌మీక్ష‌కు హాజ‌రు కావాలంటూ అధికారుల‌కు స‌మాచారం పంపారు.

మంత్రి ఆహ్వానాన్ని సీఎస్ కు పంపిన అధికారులు.. తాజాగా ఎన్నిక‌ల సంఘం అధికారుల‌ను సంప్ర‌దించ‌టం.. వారు ఓకే అన‌టంతో సోమిరెడ్డి భంగ‌ప‌డే ప్ర‌మాదం త‌ప్పిన‌ట్లైంది. అధికారులు.. మంత్రి నిర్వ‌హించే స‌మీక్షా స‌మావేశానికి హాజ‌రయ్యేందుకు అనుమ‌తిచ్చారు. ఏదో కొంప‌లు మునిగిపోయిన‌ట్లుగా.. అదేప‌నిగా స‌మీక్ష‌కు రావాల‌ని అధికారుల‌ను ఇబ్బంది పెట్టే బ‌దులు.. మ‌రో 20 రోజులు ఆగిన త‌ర్వాత ప్ర‌భుత్వం కానీ మ‌ళ్లీ ఏర్పాటు చేస్తే.. ఐదేళ్ల పాటు ఎన్ని స‌మీక్ష‌లైనా పెట్టుకోవ‌చ్చు. ఈ విష‌యాన్ని వ‌దిలేసి.. అదే ప‌నిగా స‌మీక్ష‌.. స‌మీక్ష అంటూ హ‌డావుడి చేయాల్సిన అవ‌స‌రం ఉందంటారా సోమిరెడ్డి?