Begin typing your search above and press return to search.

ఈసీ సంచలనం... వేలూరు ఎన్నిక రద్దు

By:  Tupaki Desk   |   16 April 2019 5:36 PM GMT
ఈసీ సంచలనం... వేలూరు ఎన్నిక రద్దు
X
సార్వత్రిక ఎన్నికల్లో సంచలన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ఎన్నికల ప్రచారం సాగుతుండగానే... మరో వైపు తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఆదాయపన్ను శాఖ దాడులు కొనసాగుతున్న తీరు కలకలం రేపుతోంది. ఇక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ కు వినియోగిస్తున్న ఈవీఎంల పనితీరుపై ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తరహా ఆరోపణలతోనే తొలి దశ పోలింగ్ ముగియగా... రెండో దశ పోలింగ్ కు కూడా రంగం సిద్ధమైపోయింది. నేటి సాయంత్రంతో రెండో దశ ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో ప్రచారానికి తెర పడింది. ఇలాంటి కీలక తరుణంలో తమిళనాడులోని వేలూరు పార్లమెంటు ఎన్నికను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఏ ఒక్కరూ ఊహించని రీతిలో పోలింగ్ సరిగ్గా రెండు రోజుల ముందు ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం ఒక్క తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా పెను కలకలమే రేపుతోంది. అసలు ఈ వేలూరు ఎన్నిక రద్దుకు గల కారణాలు ఏమిటన్న విషయానికి వస్తే... వేలూరు బరిలోకి నిలిచిన డీఎంకే అభ్యర్థి వద్ద ఇటీవల పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. సదరు అభ్యర్థి తన సొంత కార్యాలయంలోనే వందల కోట్ల మేర నగదును ఉంచుకున్నారు. అదికారుల దాడుల్లో ఈ మొత్తం వెలుగు చూసింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడిన నేపథ్యంలో వేలూరులో డబ్బు ఏరులై పారుతోందన్న విమర్శలు పుట్టుకొచ్చాయి.

ఈ నేపథ్యంలో ఈసీకి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీనిపై ప్రత్యేకంగానే దృష్టి సారించిన ఈసీ... అసలు ఎన్నికలను రద్దు చేయాలా? వద్దా? అన్న కోణంలో సమీక్షల మీద సమీక్షలు నిర్వహించింది. నిన్నటిదాకా కూడా వేలూరు ఎన్నిక రద్దు ప్రసక్తే లేదని చెబుతూ వచ్చింది. అయితే అనూహ్యంగా ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణమే వేలూరు ఎన్నికను రద్దు చేస్తున్నట్లుగా ఈసీ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగానే మారిపోయింది. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై తమిళనాడులోని విపక్ష పార్టీ డీఎంకే అసంతృప్తి వ్యక్తం చేసింది. వేలూరు ఎన్నిక రద్దు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ అయిపోయినట్టేనని ఆ పార్టీ ఓ ప్రకటనలో తన నిరసనను వ్యక్తం చేసింది.