Begin typing your search above and press return to search.

మోడీకి ఈసీ తాఖీదు ఇచ్చే రోజు వ‌చ్చేసిందా?

By:  Tupaki Desk   |   22 April 2019 5:23 AM GMT
మోడీకి ఈసీ తాఖీదు ఇచ్చే రోజు వ‌చ్చేసిందా?
X
ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏ మాట‌లు మాట్లాడాలి? ఏ అంశాల్ని ప్ర‌స్తావించాలి? వేటిని ప్ర‌స్తావించ‌కూడ‌ద‌న్న విష‌యాన్ని మోడీ లాంటి ముఖ్య‌నేత‌ల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఉందా? దేశ ర‌క్ష‌ణ ద‌ళాల‌కు సంబంధించిన నిర్ణ‌యాల్ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌స్తావించ‌టం దేనికి నిద‌ర్శ‌న‌మ‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. పాక్ తో ఈ మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల విష‌యాన్ని గుజ‌రాత్ లోని ప‌ట‌న్.. రాజ‌స్థాన్ లోని చిత్తోర్ ఘ‌ర్ ల‌లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో ప్ర‌ధాని మోడీ ప్ర‌స్తావించ‌టం దేనికి నిద‌ర్శ‌నం?

ర‌క్ష‌ణ అంశాల‌తో పాటు.. విదేశీ వ్య‌వ‌హారాలు..సున్నిత‌మైన కొన్నింటి వివ‌రాల్ని ప్ర‌స్తావించ‌కుండా ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించ‌టం మామూలే. అందుకు భిన్నంగా వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌ర్ వ‌ర్ద‌మాన్ విష‌యాన్ని ప్ర‌ధాని స్థానంలో ఉన్న మోడీ ప్ర‌స్తావించ‌టాన్ని ఏమ‌ని చెప్పాలి?

దేశ భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశాల్ని ప్ర‌స్తావించ‌కూడ‌ద‌న్న విష‌యం ఒక ఎత్తు అయితే.. పొరుగుదేశం స్పందించేలా ఘాటు వ్యాఖ్య‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. తాను గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చాన‌ని.. అందుకే పాక్ తోక ముడిచింద‌న్న మాట‌లు.. భార‌త్ పైలెట్ ను సాయంత్రానికి తిరిగి పంప‌కుంటే ఆ రోజు రాత్రి పాకిస్థాన్ కు కాళ‌రాత్రి అయి ఉండేద‌న్న వ్యాఖ్య‌ల్లో నిజాలు ఉన్న‌ప్ప‌టికి.. ప్ర‌స్తావించాల్సిన వేదిక స‌రైన‌ది కాద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

అభినంద‌న్ ను తిరిగి పంప‌కుంటే భావిత‌రం పాకిస్థానీయులు.. మోడీ అనే ప్ర‌ధాని హ‌యాంలో దేశానికి పూడ్చుకోలేనంత న‌ష్టం జ‌రిగింద‌న్న మాట చెప్పుకునే వారంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారుతున్నాయి. ఒక ప్ర‌ధాన‌మంత్రి స్థానంలో ఉన్న నేత‌.. త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌స్తావించాల్సిన అంశాలు ఇవేనా? అన్న‌ది ప్ర‌శ్న‌. అందులోకి రాజ‌స్థాన్.. గుజ‌రాత్ మీటింగ్ ల‌లో ఈ మాట‌లు ఎందుకు మాట్లాడార‌న్న విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌ల‌పై ఈసీ స్పందించ‌టం ఖాయ‌మ‌ని.. తాఖీదు ఇవ్వ‌టం ప‌క్కా అని చెబుతున్నారు. ఈ వాద‌న‌లో నిజం ఎంత‌న్న‌ది కాల‌మే బదులివ్వాలి.