Begin typing your search above and press return to search.
తెలంగాణలో కూసిన కోడ్ రూల్స్ ఇవేనట!
By: Tupaki Desk | 28 Sept 2018 10:21 AM ISTఅందరి అంచనాల్ని తలక్రిందులు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల షెడ్యూల్ పై కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమల్లోకి తెస్తూ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి నరేంద్ర ఎన్. బుటోలియా తాజాగా కేంద్ర కేబినెట్ కార్యదర్శితో పాటు.. అన్ని రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఇందులో అసెంబ్లీ రద్దు అయిన ప్రాంతాలు.. అపద్దర్మ ప్రభుత్వాలు నడుస్తున్న రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని తక్షణ తెర మీదకు తీసుకొస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ఆదేశాల ప్రకారం..
+ అసెంబ్లీ అర్ధంతరంగా రద్దయిన పరిస్థితుల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని పార్ట్-7 కింద (అధికారపార్టీ) ఉన్న నియమ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయి.
+ ఎన్నికలు పూర్తయి - కొత్త అసెంబ్లీ ఏర్పడేంత వరకూ ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి.
+ కోడ్ కాంటాక్ట్ రూల్స్ అన్నీ ఆపద్ధర్మ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు - కేంద్ర ప్రభుత్వానికీ వర్తిస్తాయి.
+ తాజా నిర్ణయం నేపథ్యంలో ఆపద్ధర్మ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకూ ఎలాంటి కొత్త పథకాలూ - ప్రాజెక్టులు ప్రకటించడానికి వీల్లేదు.
+ ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని పార్ట్-7 కింద పొందుపరిచిన నిషేధిత కార్యకలాపాలేవీ చేపట్టకూడదు.
+ అనధికార పనుల కోసం అధికార వనరులను ఉపయోగించరాదు. అధికారిక పర్యటనలను ఎన్నికల పనులతో కలపకూడదు.
+ ఈ నిబంధనలు ఆపద్ధర్మ రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు - ఇతర అధికారులు - కేంద్ర ప్రభుత్వం - ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకూ వర్తిస్తాయి.