Begin typing your search above and press return to search.

పార్టీలకు షాకిచ్చిన ఎన్నికల కమీషన్

By:  Tupaki Desk   |   30 Sep 2021 4:30 PM GMT
పార్టీలకు షాకిచ్చిన  ఎన్నికల కమీషన్
X
హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో అన్నీ పార్టీలకు కేంద్రఎన్నికలకమీషన్ పెద్ద షాకే ఇచ్చింది. మంత్రివర్గంలో నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఎంఎల్ఏగా ఈటల రాజేందర్ రాజీనామా చేయటంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అప్పటికే కేసీయార్-ఈటల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవటంతో హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలవటం ఇద్దరికీ అత్యంత ప్రతిష్టాత్మకమైంది. దీంతో ఇటు కేసీయార్ తరపున మంత్రులు, టీఆర్ఎస్ నేతలు అటు ఈటల+బీజేపీ నేతలు నియోజకవర్గాన్ని ప్రతిరోజు హోరెత్తించారు.

దాదాపు మూడు నెలలపాటు నియోజకవర్గంలో వీళ్ళ ఎన్నికల ప్రచారం రచ్చరచ్చ అయిపోయింది. ఎంఎల్ఏగా రాజీనామా చేసిన ఈటల బీజేపీలో చేరటంతో ఆయనకు కమలం నేతలు మద్దతుగా నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టేశారు. ప్రచారంలో రెండువైపులా నువ్వా-నేనా అన్నట్లుగా సాగటంతో ఉద్రిక్తతలు కూడా బాగా పెరిగిపోయాయి. అసలు నోటిఫికేషన్ రాకముందే పరిస్దితి ఇలాగుంటే నోటిఫికేషన్ తర్వాత పరిస్ధితులు ఇంకెంత ఉద్రిక్తంగా మారుతాయో అని చాలామందిలో టెన్షన్ పెరిగిపోయింది.

అయితే ఈమధ్యనే నోటిఫికేషన్ జారీచేసిన కేంద్ర ఎన్నికల కమీషన్ అక్టోబర్ 1వ తేదీ నుండి ఎన్నికల నిబంధనలు అమల్లోకి వస్తాయని చెప్పింది. దాంతో పాటు కరోనా వైరస్ నేపధ్యంలో రాజకీయపార్టీలు విధిగా పాటించాల్సిన నిబంధనలను కూడా జారీచేసింది. నిబంధనలను చూసి రాజకీయపార్టీలకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయ్యింది. ఎందుకంటే స్టార్ క్యాంపైనర్లు పాల్గొనే బహిరంగసభలకు కూడా వెయ్యిమందికి మించి జనాలు హాజరయ్యేందుకు లేదని కమీషన్ నిబంధన విధించింది.

స్టార్ క్యాంపైనర్లంటే ఇటు కేసీయార్ బీజేపీ తరపున అమిత్ షా తో పాటు కేంద్రమంత్రులు, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు. కాంగ్రెస్ నుండి జాతీయనేతలు+రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు. స్టార్ క్యాంపైనర్ల బహిరంగసభలకే వెయ్యిమందికి మించి ఉండేందుకు లేదంటే ఇక మామూలు నేతల సభలకు హాజరయ్యే జనాల విషయాన్ని చెప్పేదేముంది ? కమ్యూనిటి హాళ్ళల్లో నిర్వహించే సమవేశాల్లో 500 మందికి మించి హాజరయ్యేందుకు లేదు. ఇండోర్ సమావేశాలకు 200 మంది, అభ్యర్ధి చేసే ఇంటింటి ప్రచారానికి 5 మందికి మించి కనబడకూడదు.

రోడ్డుషోలు, బైకు, కార్లు, సైకిల్ ర్యాలీలకు అసలు అనుమతే లేదు. ఇలాంటి అనేక ఆంక్షలతో పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తమ ప్రతాపం ఏమి చూపించాలని పార్టీలు అనుకుంటే కరోనా వైరస్ కారణంగా కమిషన్ ఫుల్లుగా ఆంక్షలను పెట్టేసింది. దాంతో స్టార్ క్యాంపైనర్ల సభలు లేకుండానే, కీలక నేతల సమావేశాలు, రోడ్డుషోలు లేకుండానే ప్రచారం చాలా చప్పగా జరగబోతోంది. పార్టీల వైపు నుంచి ఈ నిబంధనలు పాటించట చాలా కష్టమే అయినా మామూలు జనాలు మాత్రం హ్యాపీగా ఫీలవుతున్నారు.