Begin typing your search above and press return to search.

వైసీపీ - టీఆర్ ఎస్‌ కు తీపిక‌బురు చెప్పిన ఈసీ!

By:  Tupaki Desk   |   1 Aug 2019 4:35 PM GMT
వైసీపీ - టీఆర్ ఎస్‌ కు తీపిక‌బురు చెప్పిన ఈసీ!
X
తెలుగు రాష్ట్రాల్లో మ‌రోమారు ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌డి స‌ద్దుమ‌ణిగి ఏపీలో స్థానిక సంస్థ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం క‌నిపిస్తున్న త‌రుణంలో..మ‌రో కీల‌క ఎన్నిక‌ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఎన్నిక‌ల‌న్నీ ముగిశాయ‌ని భావిస్తున్న తెలంగాణ‌కు ఓ ఉప ఎన్నిక తెచ్చి పెట్టింది. ఏపీలో రాజీనామా చేసిన ఎమ్మెల్సీల స్థానంలో ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా....తెలంగాణ‌లో అన‌ర్హ‌త వేటు ప‌డ్డ ఎమ్మెల్సీ స్థానంలో పోరు జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది.

తెలంగాణలోని ఒక‌టి - ఆంధ్రప్రదేశ్‌ లో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ లో సభ్యుల రాజీనామాతో ఖాళీగా ఉన్న 3 ఎమ్మెల్సీ స్థానాలు - తెలంగాణలో యాదవ రెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆగస్టు 7వ తేదీ 2019 నోటిఫికేషన్ విడుద‌ల అవుతుండ‌గా నామినేషన్ల స్వీకరణ ఆగస్టు 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 16న ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న ప్రారంభం అవుతుంది. నామినేషన్ విత్ డ్రా 19వ తేదీన జ‌ర‌గ‌నుంది. ఎన్నికల నిర్వహణ - ఓట్ల లెక్కింపు 26వ తేదీన జ‌ర‌గ‌నుంది. ఆగస్ట్ 28వ తేదీ లోపు ఎన్నికలు పూర్తి కానున్నాయి.

చేవెళ్ల ఎంపీగా ఉన్న‌ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ ఎస్‌ కు గుడ్‌బై చెప్పిన సమ‌యంలో యాదవరెడ్డి సైతం పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌య్యారు. విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో ఆయన కూడా పార్టీ వీడటం ఇక లాంఛనమే అని భావించిన‌ టీఆర్ ఎస్ అధిష్టానం అంతకుముందే ఆయనపై వేటు వేయడం గమనార్హం. మేడ్చల్‌ లో యూపీఏ ఛైర్‌ పర్సన్ సోనియా గాంధీ పాల్గొన్న‌ సభలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. మ‌రోవైపు ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీలు క‌ర‌ణం బ‌ల‌రామ కృష్ణ‌మూర్తి - ఆళ్ల నాని - కోల‌గ‌ట్ల వీర‌భద్ర‌స్వామి త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డంతో ఆ స్థానాల‌కు ఎన్నిక‌ జ‌రుగుతోంది. అధికార పార్టీకే ఈ ఎన్నిక‌ల్లో గెలుపు అవ‌కాశం ఎక్కువగా ఉంద‌ని అంటున్నారు.