Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఈసీ

By:  Tupaki Desk   |   1 Nov 2018 7:33 AM GMT
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఈసీ
X
ఏపీ సీఎం చంద్రబాబుకు ఈసీ గట్టి షాకే ఇచ్చింది. టీవీ చానెళ్లలో తమ పథకాల ప్రచారంతో హోరెత్తిస్తున్న అధికార టీడీపీకి ఎన్నికల కమిషన్ తాజాగా అడ్డుకట్టవేసింది. అన్నా క్యాంటీన్లు, ముఖ్యమంత్రి యువనేస్తం సహా పలు పథకాల గురించి కొద్దిరోజులుగా తెలుగు వార్తా చానళ్లలో టీడీపీ ప్రభుత్వం పలు ప్రకటనలు జారీ చేస్తోంది. తెలుగు రాష్ట్రాలు రెండింట్లో ఈ ప్రకటనలు జారీ అవుతున్నాయి.

కాగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో మహాకూటమితో జతకట్టి తెలుగుదేశం పార్టీ కూడా పోటీచేస్తోంది. దీంతో టీడీపీ ప్రకటనలు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తాయని.. వీటిని నిలిపివేయాలని ఎం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ప్రకటనల ద్వారా టీడీపీకి అదనపు రాజకీయ ప్రయోజనం దక్కుతుందని ఆయన విన్నవించారు.

దీనికి స్పందించిన ఈసీ తెలంగాణలోని అన్ని న్యూస్ చానెళ్లకు ఈ ప్రకటనలను ప్రసారం చేయకుండా నిలిపివేయాలని తాజాగా నోటీసులు పంపించింది. దీంతో తాజాగా వాటిల్లో యువనేస్తం.. అన్న క్యాంటీన్ల ప్రకటనలు నిలిపివేశారు.

ప్రతీసారి ఎన్నికల వేళ .. చంద్రబాబు తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాలా తెలివిగా ఇలాంటి కుయుక్తులు వేస్తుంటాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతీ ఎన్నికల్లోనే టీడీపీకి హైప్ తెచ్చేందుకు ఇలా పథకాలను ప్రకటనలుగా మలిచి వదులుతుంటాడు. గడిచిన సారీ ఇలానే చేసినా ఎవ్వరూ అభ్యంతరం పెట్టలేదు. దీని ద్వారా టీడీపీ అనుకూల మీడియాకు - టీడీపీకి లాభం చేకూరింది. ఈ ప్రకటనలు ఆకర్షించేదిగా.. ఈసీకి దొరక్కుండా తీర్చుదిద్దుతుంటాడు. కానీ ఇదివరకులా పరిస్థితి లేదు. చంద్రబాబు ఆవలిస్తే పేగులు లెక్కబెట్టేలా జనం తయారయ్యారు. అందుకే చంద్రబాబు ఎంతో పక్కగా స్కెచ్ గీసి ప్రకటనలు వదిలినా ఫిర్యాదు చేసి వాటిని ఆపించేశారు. ఇలా బాబు ప్లాన్ కు ఆదిలోనే అవాంతరాలు కలుగడం టీడీపీ శ్రేణులను నివ్వెరపరుస్తోంది.