Begin typing your search above and press return to search.

నోటి దురుసుతో ఈసీకి దొరికిపోయిన రేవంత్‌

By:  Tupaki Desk   |   3 Dec 2018 4:13 AM GMT
నోటి దురుసుతో ఈసీకి దొరికిపోయిన రేవంత్‌
X
కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి బ‌లం - బ‌ల‌హీన‌త కూడా ఆయ‌న మాట‌తీరే అనేది చాలామంది చెప్పేమాట‌. ప‌దునైన విమ‌ర్శ‌లు - ఆక‌ట్టుకునే మాట‌లు ఆయ‌న బ‌ల‌మ‌ని పేర్కొంటూనే...శృతిమించిన ఆరోప‌ణ‌లు - విచ‌క్ష‌ణ కోల్పోయిన విమ‌ర్శ‌లు ఆయ‌న స్థాయిని త‌గ్గిస్తున్నాయ‌ని స‌న్నిహితంగా చూసిన రాజ‌కీయ వ‌ర్గాల విశ్లేష‌ణ‌. అలాంటి రేవంత్ రెడ్డి తాజాగా త‌న నోటిదురుసుతో మ‌ళ్లీ బుక్క‌య్యారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా కొడంగ‌ల్‌లో జ‌రిగిన సోదాల‌పై రేవంత్ దూకుడుగా స్పందించిన సంగ‌తి తెలిసిందే. తమ అనుచరుల ఇళ్లపై పోలీసులు అక్రమ దాడులు చేస్తున్నారని - సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. అందుకు నిరసనగా 4వ తేదీన కొడంగల్‌ నియోజకవర్గంలో కేసీఆర్‌ పర్యటనను అడ్డుకుంటామని తెలిపారు. తన అనుచరులపై అక్రమ సోదాలు - దాడులకు నిరసనగా కొడంగ‌ల్‌ బంద్‌ నిర్వహిస్తామని చెప్పారు. ఈనెల 4వ తేదీన కేసీఆర్‌ కొడంగల్‌ పర్యటనను అడ్డుకోవాల‌ని - ప్రతి కార్యకర్త రోడ్డు మీదకు వచ్చి కేసీఆర్‌ కు త‌మ స‌త్తా చాటాల‌ని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, కేసీఆర్ పర్యటనలో నిరసనలు తెలిపి - మా పదునేందో పట్టుదల ఏందో చూపిస్తామని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ఉద్యమకారుడు కాదు.. దగుల్బాజీ - దోపిడిదారుడు. నేనే రాజ్యం.. రాజ్యమంటేనే నేను అనేలా కేసీఆర్‌ ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. కొడంగల్‌ ప్రజలతో గోక్కున్నవాడెవడూ బతికి బట్టకట్టలేదని హెచ్చరించారు. చింతమడక చీటర్లకు కొడంగల్‌ లో ప్రవేశం లేదని ఆరోపించారు.

ఇలా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సీఈవో రజత్ కుమార్ కు ఫిర్యాదు చేసింది. కొడంగల్ ప్రజలను ఆయన అకారణంగా రెచ్చగొడుతూ - ఈనెల 4న కేసీఆర్ పర్యటన - ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోతో సహా ఆధారాలను అందచేసింది. వెంటనే స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ వ్యవహారంపై తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. రేవంత్ వ్యవహారంపై ఏం చర్యలు తీసుకున్నారో రేపటిలోగా.. వివరణ ఇవ్వాలని రజత్ కుమార్ ఆదేశించారు. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ కొడంగల్ బంద్‌ కు పిలుపునిచ్చి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి క‌న్నెర్ర‌కు కార‌ణ‌మైన రేవంత్‌ పై పోలీసులు ఏ విధంగా చ‌ర్య తీసుకుంటారో వేచిచూడాల్సిందే. అయితే, ఇప్ప‌టికే డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి పై రేవంత్ రెడ్డి ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.